కరీంనగర్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ)/ హుజూరాబాద్/టౌన్ : హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి విసిరిన సవాల్‌కు ఈటల రాజేందర్ ముఖం చాటేశారు. హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన చర్చా వేదికపైకి ఇచ్చిన సమయం ప్రకారం ఉదయం 11 గంటలకు చేరుకున్నా, ఎమ్మెల్యే ఈటల మాత్రం రాలేదు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన కౌశిక్‌రెడ్డి 11.05 గంటలకు చర్చ వేదికకు చేరుకోగా, చౌరస్తాలో ఎటు చూసినా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో సందడిగా నెలకొనడంతో పాటు ఆ ప్రాంతమంతా గులాబీ మయమైంది. దాదాపు 2500 మంది స్వచ్ఛందంగా పలు గ్రామాల నుంచి చర్చ కార్యక్రమంలో పాల్గొనేందుకు తరలివచ్చారు. ఈ సందర్భంగా ‘జై కేసీఆర్.. జైజై కౌశిక్’ నినాదాలతో మార్మోగించారు. చర్చా వేదిక వద్ద దాదాపు గంట పాటు వేచి చూసినా రాకపోవడంతో ఈటల కోసం వేసిన కుర్చీకి పూల మాట వేసి సన్మానం చేశారు.
సుమారు అరగంట పాటు వేచి చూసిన కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్యే ఈటల చర్చకు రావడం లేదని పోలీసులు సమాచారం ఇవ్వడంతో అనంతరం రాజేందర్‌పై తన ప్రసంగంలో నిప్పులు చెరిగారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో రూ.10 లక్షలకు కూడా కేసీఆర్ జీవో ఇవ్వలేదని చెప్పిన ఈటల రాజేందర్‌కు రూ.100 కోట్లు ఇచ్చిన జీవోలతో సహా కౌశిక్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ అంటే దమ్మున్న నాయకుడని, ఈగల లాగా ముఖం చాటేసే దొంగ కాదని, అభివృద్ధి చేయలేని దద్దమ్మ కాదని స్పష్టం చేశారు. అయితే మొదట కొందరు బీజేపీ కార్యకర్తలు వచ్చి కవ్వించే ప్రయత్నం చేయగా టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. రెచ్చగొట్టేందుకు కుట్ర పన్నుతున్నారని తెలుసుకుని సంయమనం పాటించారు. పాడి కౌశిక్‌రెడ్డి ప్రసంగం ముగిసి వెళ్లిన తర్వాత కూడా కొంత మంది బీజేపీ కార్యకర్తలు చౌరస్తా వద్దకు చేరుకొని మరోసారి టీఆర్ఎస్ శ్రేణులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. పోలీసులు సంయమనం పాటిస్తూ శాంతిభద్రతలకు భంగం కలుగకుండా బీజేపీ నాయకులను డీసీఎం వ్యాన్‌లో సైదాపూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా, అభివృద్ధిపై శాంతియుతంగా చర్చ కార్యక్రమానికి ఆహ్వానిస్తే ఈటల రాజేందర్ రాకపోగా బీజేపీ నాయకులు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడం ఏంటని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ సిద్ధాంతమే రెచ్చగొట్టి ఓట్లు సంపాదించుకోవడమని, ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా గెలిచి తొమ్మిది నెలలు అయినప్పటికీ ఒక్క అభివృద్ధి పని చేయలేదని మండిపడుతున్నారు.