కమాన్‌చౌరస్తా/జమ్మికుంట/ హుజూరాబాద్ రూరల్/ సైదాపూర్, వీణవంక, శంకరపట్నం/ చిగురుమామిడి/ కరీంనగర్ రూరల్/ గంగాధర/ రామడుగు, సెప్టెంబర్21 : ఒక్కేసి పువ్వేసి చందమామ.. ఒక్క జాము ఆయె చందమామ.. రామ రామ రామ ఉయ్యాలో.. రామనే శ్రీరామ ఉయ్యాలో.. అంటూ ఉయ్యాల పాటలు, ఆడబిడ్డల చప్పట్లు వాడవాడలా మార్మోగాయి. జిల్లా వ్యాప్తంగా ఎంగిలి బతుకమ్మ సంబురాలు ఆనందోత్సాహాల మధ్య ఆదివారం ప్రారంభమయ్యాయి. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చిన ఆడబిడ్డలు.. ప్రధాన కూడళ్లు, ఆలయాల వద్ద పెట్టి ఆడిపాడారు. అనంతరం చెరువులు, కుంటలు, తదితర చోట్ల నిమజ్జనం చేశారు. కరీంనగర్ చైతన్యపురిలోని శ్రీ మహాశక్తి ఆలయంలో కేంద్ర సహాయ మంత్రి ఎంపీ బండిసంజయ్ కుమార్ సతీమణి అపర్ణ బతుకమ్మ ఆడారు. రాంనగర్ శ్రీరమాసహిత సత్యనారాయణ స్వామి, శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాణంగంలో మాజీ డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణీహరిశంకర్, కాలనీ వాసులు బతుకమ్మ ఆడారు.
జిల్లా కేంద్రంలోని అల్ఫోర్స్, ట్రినిటీ, ఎస్ఆర్ కళాశాలల ప్రాంగణాల్లో బతుకమ్మ సంబురాలు అట్టహాసంగా సాగాయి. ట్రినిటీ కళాశాలలో నిర్వహించిన వేడుకలో కళాశాల ఫౌండర్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. పూలను పూజించే పండుగకు గుర్తింపు తెచ్చిన ఘనత తెలంగాణ రాష్ట్రం సాధించిన బీఆర్ఎస్ పార్టీదేన్నారు. హుజూరాబాద్ పట్టణంలో బతుకమ్మ సంబురాల్లో కమిషనర్ సమ్మయ్య పాల్గొని, మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. రామడుగు మండలం రుద్రారం గీతాంజలి విద్యాలయంలో జరిగిన సంబురాలకు ముఖ్య అతిథిగా మాజీ ఎంపీటీసీ గుర్రం దేవికా రాజశేఖర్‌గౌడ్ హాజరై, చిన్నారులతో కలిసి బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.