Singareni workers’ strike | రామగిరి, సెప్టెంబర్ 15: సింగరేణి కోల్ మైన్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో శనివారం కలకత్తాలో నిర్వహించిన కార్మికుల మహాధర్నా ఘనంగా జరిగింది. ఈ మహాధర్నాకు సంఘీభావంగా అర్జీ-3 సెంటినరీ కాలనీ తెలంగాణ చౌరస్తాలో సింగరేణి ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన కార్మికులు పెద్ద ఎత్తున హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సింగరేణి కార్మికులు తమ డిమాండ్లను స్పష్టంగా వెల్లడించారు.
కనీస పెన్షన్ రూ.15,000 నుంచి అమలు చేయాలని, వైద్య సదుపాయాల ఖర్చులను రూ.25,000 వరకు పెంచాలని, సింగరేణి మాజీ కార్మికుల గ్రాట్యూటీని జనవరి 1, 2017 నుంచి అమలు చేయాలని, అలాగే సీపీఆర్ఎంఎస్ ద్వారా వైద్యం పొందుతున్న మాజీ కార్మికులకు హాస్పిటల్స్లో జరుగుతున్న అవకతవకలను తక్షణమే ఆపాలని కోరారు.
పెన్షన్, వైద్య సదుపాయాలు, గ్రాట్యూటీ వంటి అంశాలపై తమ సమస్యలు పరిష్కరించే వరకు దీక్షను కొనసాగిస్తామని, పోరాటాన్ని ఆపబోమని కార్మికులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గౌతం శంకరయ్య, మల్లయ్య, జవహర్, పట్నం సత్యనారాయణ, తోట మొండయ్య, పాముల శేషు, వంగ రాజసమ్మయ్య, పుప్పాల గట్టయ్య, మాస లక్ష్మయ్య, చిట్టవేన రాజేశం, పగడాల జగదీశ్, కే శ్రీనివాస్ రెడ్డి, కొండ సమ్మయ్య, విలయ్య, తీగల భూమయ్య, ప్రతాప్ రెడ్డి, రాంచందర్ రావు, కందుల చంద్రయ్య, పెడం వెంకటేశం, అంకతి నాగన్న, శ్రీనివాస్, ఆదెపు రాజయ్య తదితరులు పాల్గొన్నారు.