ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ సబ్స్టేషన్లలో రిటైర్డ్ ఆపరేటర్ల నియామకానికి సంస్థ ఇచ్చిన వెసులుబాటును పలువురు నాయకులు ఆదాయవనరుగా మార్చుకుంటున్నట్టు తెలుస్తున్నది. నిబంధనల మేరకు వ్యవహరిస్తూ అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన యంత్రాంగం చోద్యం చూస్తున్నట్టు విమర్శలు వ్యక్తమవుతుండడం ఆ శాఖలో చర్చనీయాంశమవుతున్నది.
ముకంరపుర, డిసెంబర్ 24 : క్షేత్ర స్థాయిలో వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడంలో ఆపరేటర్లే కీలకం. అయితే ప్రతి 33/11కేవీ సబ్ స్టేషన్లలో నలుగురు ఆపరేటర్లు ఉండాలి. కానీ, పలు సబ్ స్టేషన్లలో ఇద్దరు ముగ్గురితో నెట్టుకొస్తున్నారు. మరికొన్ని చోట్ల ఇద్దరే ఉన్నారు. దీంతో ఉన్న సిబ్బందిపై పనిభారం పడి విధులు సక్రమంగా నిర్వర్తించలేక పోతున్నారు. కొరత కారణంగా కొన్నిచోట్ల అనారోగ్యం ఉన్నా రోజుకు 12 గంటలకు పైగా విధులు నిర్వహించాల్సిన దయనీయ స్థితి ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఎకడ చిన్న పొరపాటు జరిగినా ఆ సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రతి విద్యుత్ సబ్ స్టేషన్లో నలుగురు ఆపరేటర్లు కచ్చితంగా ఉండాలని ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ నిర్ణయించింది. అయితే సంస్థలో పనిచేసి రిటైర్డ్ అయిన ఉద్యోగులను గౌరవ వేతనంతో నియమించుకుంటే కొంత వెసులుబాటు ఉంటుందని ఉన్నతాధికారులు భావించారు. ఆ మేరకు సంస్థ సీఎండీ నియామకాలకు వెసులు బాటు కల్పిస్తూ ఆదేశాలిచ్చారు. ఈ అవకాశాన్ని కొన్ని విద్యుత్ సంఘాలు ఆసరాగా తీసుకుంటున్నట్టు తెలుస్తున్నది. కొందరు నాయకులు తమ పలుకుబడి, అధికారులతో తమకున్న సన్నిహిత సంబంధాలతో ఆపరేటర్ పోస్టులను ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంస్థలో పనిచేసి రిటైర్డ్ అయి ఆపరేటర్‌గా పనిచేసేందుకు ఆసక్తి ఉన్న వారిని గుర్తించి.. ప్రలోభ పెడుతున్నట్టు తెలుస్తున్నది.
‘యూనియన్ కోసం కొంత మొత్తాన్ని చందా రూపంలో ఇస్తే.. మీరు కోరుకున్న చోట పోస్టింగ్ ఇప్పిస్తాం’ అంటూ బేరసారాలు చేస్తూ.. అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో కరీంనగర్ రూరల్ సబ్ డివిజన్ పరిధిలోని ఓ సబ్‌స్టేషన్‌లో ఇద్దరు ఆపరేటర్లు మాత్రమే విధులు నిర్వర్తిస్తుండగా అందులో ఒకరు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇకడ మరొక ఆపరేటర్ అవసరం కాగా, సంస్థలో రిటైర్డ్ అయిన ఓ ఉద్యోగి పనిచేయడానికి ముందుకు వచ్చారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఇకడే అసలు కథ మొదలైంది. రంగంలోకి దిగిన ఓ యూనియన్ ప్రతినిధులు.. రిటైర్డ్ ఉద్యోగికి కోరుకున్న చోట ఆపరేటర్ పోస్టు ఇప్పిస్తామంటూ తమ దారికి తెచ్చుకున్నారు. అతను ముందుగా దరఖాస్తు చేసుకున్న సబ్‌స్టేషన్ కాకుండా మెయిన్ రోడ్డుకు అందుబాటులో ఉండే సబ్‌స్టేషన్‌లో పోస్టింగ్ ఇప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తున్నది. నిబంధనలకు మేరకు నడుచుకోవాల్సిన అధికారులు యూనియన్ నాయకుల ఒత్తిడికి తలొగ్గారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలో మరో యూనియన్ నాయకులు జోక్యం చేసుకోవడం, ఇద్దరు ఆపరేటర్లు ఉన్న చోటే రిటైర్డ్ ఉద్యోగిని నియమించాలని, దీనివల్ల అనారోగ్యంతో బాధపడుతున్న రెగ్యులర్ ఆపరేటర్‌కు కొంత ఉపశమనం కలుగుతుందని ఉన్నతాధికారులకు నివేదించినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతానికి రిటైర్డ్ ఆపరేటర్ నియామకం విషయంలో అధికారులు ఏ నిర్ణయం తీసుకోకుండా స్తబ్దుగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఇప్పుడీ విషయం సంస్థలో చర్చనీయాంశంగా మారింది.