ముకరంపుర, జూలై 4: విధి నిర్వహణలో అసువులు బాసిన విద్యుత్ అమరులను స్మరించుకునేలా కరీంనగర్ సర్కిల్ కార్యాలయంలో స్మృతి చిహ్నం (Electrical Martyrs) ఏర్పాటుకు అధికారులు అంతా సిద్ధం చేశారు. ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (NPDCL) సీఎండీ ఆదేశాల మేరకు పనులు ప్రారంభించారు. సొంత భవనాలున్న అన్ని సర్కిల్ కార్యాలయాల్లో స్మృతి చిహ్నాలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే వరంగల్లో స్మృతి చిహ్నం నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించగా.. ప్రస్తుతం కరీంనగర్లో పనులు మొదలయ్యాయి. ఇందుకోసం కార్యాలయం ఎదురుగా కేటాయించిన స్థలంలో పనులు చేపట్టారు. సుమారు 6 అడుగుల 3 అంగుళాల ఎత్తుతో స్మృతి చిహ్నం రూపుదిద్దుకోనుంది. 3 అడుగుల మేర కాంక్రీటు దిమ్మెపై ప్రత్యేకంగా కుడి మోచేతి భాగం నుంచి అరచేతిని చాచి ఐదు వేళ్లను పైకెత్తినట్లు చిహ్నం నమూనా ఉండనుంది.
అర చేతిలో మోస్తున్నట్లుగా ఉన్న మెరుపు పైభాగంలో చూపుడు, మధ్య వేళ్ళను తాకుతుండగా కింది వైపు మణికట్టు దిగువకు వస్తున్నట్లుగా ఉన్న చిహ్నం నమూనా 3 అడుగుల 3 అంగుళాల ఎత్తులో అందరినీ ఆకట్టుకునేలా తీర్చిదిద్దనున్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి చిహ్నాన్ని ప్రతిష్టించనున్నారు. విధి నిర్వహణలో అసువులు బాసిన విద్యుత్ ఉద్యోగులను స్మరిస్తూ.. ప్రమాదాలకు ఆస్కారం లేని విధంగా ప్రతి విద్యుత్ ఉద్యోగి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సురక్షితంగా విధులు నిర్వహించేలా అప్రమత్తతను తట్టి లేపనుంది.