కరీంనగర్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నికలకు సంబంధించి ఈ నెల 10న జరుగనున్న పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహణపై ఉమ్మడి జిల్లాలోని అదనపు కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పోలింగ్ ప్రక్రియ నిర్వహణ సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు. ఎన్నికలకు ఎనిమిది పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, కరీంనగర్‌లోని జడ్పీ కార్యాలయం, హుజూరాబాద్, జగిత్యాల, కోరుట్ల, పెద్దపల్లి, మంథని, హుస్నాబాద్‌లోని ఎంపీడీవో కార్యాలయాల్లో, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జడ్పీ కార్యాలయంలో పోలింగ్ కేంద్రాలుంటాయని తెలిపారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, ప్రతి పోలింగ్ కేంద్రంలో సుమారు 200 వరకు ఓటర్లు ఉంటారన్నారు. పోలింగ్‌లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఓటర్లుగా ఓటు హకు వినియోగించుకుంటారని తెలిపారు.
సంతకం చేయరాని, వేలి ముద్ర వేసే ఓటర్లుంటే ఓటేసేందుకు సహాయకుల కోసం మూడు రోజుల ముందే దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. బ్యాలెట్ పేపర్‌పై పోలింగ్ అధికారి అందజేసే వాయిలెట్ పెన్‌తో మాత్రమే అంకెలను ప్రాధాన్యతా క్రమంలో వేసేలా వారికి చెప్పాలని సూచించారు. బ్యాలెట్ పేపర్ కౌంటర్ ఫాయిల్‌పై ఓటర్ సంతకం తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ప్రిసైడింగ్ అధికారులు పీవో డైరీలు రాసేలా చూడాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో షామియానాలు, తాగునీరు, లైటింగ్, ర్యాంపులు, హెల్ప్ డెస్ ఏర్పాటు చేయాలని, మెడికల్ టీం ఏఎన్ఎంలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. ఓటర్లు తప్పనిసరిగా మాసులు ధరించి రావాలని, ఆరు అడుగుల చొప్పున భౌతిక దూరం పాటిస్తూ నిలుచునేందుకు మారింగ్ చేయాలని సూచించారు. ఓటర్లు ఓటు వేసేందుకు గానూ డిస్పోజబుల్ గ్లోవ్స్ ఇవ్వాలని తెలిపారు. పోలింగ్ కేంద్రంలోకి ఓటర్లు సెల్ఫోన్లు తీసుకురాకుండా చూడాలని సూచించారు. సెల్ఫోన్లు బయట ఉంచేందుకు ఒకరిని నియమించాలన్నారు. కొవిడ్ పేషెంట్లు ఉంటే వారికి మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు ఓటేసేందుకు అవకాశం ఇవ్వాలన్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
అంతకుముందు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఎస్సారార్ కళాశాలలో ఏర్పాటు చేయనున్న డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ సెంటర్‌ను పరిశీలించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎనిమిది పోలింగ్ కేంద్రాలుంటాయని, 9న పోలింగ్ సామగ్రితో పోలింగ్ అధికారులు కేంద్రాలకు తరలివెళ్తారని, ఇందుకు సంబంధించి ఏర్పాట్లను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం బ్యాలెట్ బాక్సులను భద్రపరిచే స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ హాలును పరిశీలించారు. కార్యక్రమాల్లో కరీంనగర్ అదనపు కలెక్టర్ జీవీ శ్యాం ప్రసాద్‌లాల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, ఆర్డీవో ఆనంద్‌కుమార్, మున్సిపల్ కమిషనర్లు, కరీంనగర్ జడ్పీ సీఈవో ప్రియాంక, కరీంనగర్ అర్బన్ తహసీల్దార్ సుధాకర్, ఏసీపీ తుల శ్రీనివాస్‌రావు, కలెక్టరేట్ ఏవో లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
72 గంటల ముందు ప్రచారం ముగించాలి
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని పోలింగ్‌కు 72 గంటల ముందు ముగించాలని ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కరీంనగర్ స్థానిక సంస్థల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు 72 గంటల ముందు అనగా డిసెంబర్ 7న సాయంత్రం 7గంటల నుంచి డిసెంబర్ 10న పోలింగ్ ముగిసేదాకా నిశబ్ద కాలం (సైలెన్స్ పీరియడ్) అని పేర్కొన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 సెక్షన్ (126) ప్రకారం ఎన్నికల ప్రచారానికి సంబంధించి రాజకీయ పార్టీలు, మీడియా కార్యక్రమాలు, ప్రచార సభలు, సమావేశాలు, బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించరాదని తెలిపారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన సినిమాటోగ్రఫీ, టెలివిజన్, ప్రచార సామగ్రి ప్రజలకు తెలిపేలా ప్రదర్శించరాదని పేర్కొన్నారు. మ్యూజికల్ కచేరీలు, ఇతర వినోద కార్యక్రమాలు నిర్వహించరాదని, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారికి రెండేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారని, లేక రెండు శిక్షలను అమలు చేస్తారని తెలిపారు.