Aauto drivers | పెద్దపల్లి టౌన్ జులై 4: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు, ఇందిరమ్మ ఇల్లు, నెలకు 12, వేల ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పి అధికారంలోకి రాగానే పై హామీలన్నీ నెరవేర్చలేదని తెలంగాణ ఆటో యూనియన్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
జులై 10న హైదరాబాదులో జరుగు కేబినెట్ సమావేశంనకు ముందే ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆటో డ్రైవర్ల సత్తాను కాంగ్రెస్ పార్టీకి చూపెడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ సర్కార్ తీసుకువచ్చిన మహాలక్ష్మి పథకం ద్వారా ఆటో డ్రైవర్లకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్ల సమస్యల సాధన కోసం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆటో డ్రైవర్ల మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ మహాసభకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఆటో డ్రైవర్లు కదిలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రేణిగుంట్ల సురేష్ ప్రధాన కార్యదర్శి సదానందం నాయకులు ఎలగందుల నాంపల్లి చిలుముల కుమార్, ఎవరి తిరుపతి, జబ్బర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.