Education | పెగడపల్లి: ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు తేలిక పద్ధతిలో విద్యా బోధన చేయడం వల్ల వారికి సులభంగా అర్థమవుతుందని పెగడపల్లి ఎస్సై కిరణ్ కుమార్, మండల విద్యాధికారి సులోచన పేర్కొన్నారు. పెగడపల్లి విద్యావనరుల కేంద్రంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఆధ్వర్యంలో బుధవారం మండల స్థాయి టీఎల్ఎం మేళాను నిర్వహించారు.
ఎస్సై, ఎంఈవో ముఖ్య అథితులుగా హాజరై మేళాను పరిశీలించి మాట్లాడుతూ బోధనోపకరణాల ద్వారా విద్యనభ్యసించడం వల్ల విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కలుగుతుందని వివరించారు. అనంతరం జిల్లా పరిషత్ పాఠశాలలో సైబర్ నేరాలు, గాంజా, మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై ఎస్సై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎంలు లలిత, శారద, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ప్రభాకర్ రెడ్డి, పాఠశాల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, సీఆర్పీలు రాజమల్లు, మల్లేశం, సంతోష తదితరులు పాల్గొన్నారు.