ఇంటర్మీడియెట్‌లో ఉత్తమ ఫలితాల కోసం విద్యాశాఖ అధికారులు, కళాశాలల ప్రిన్సిపాల్స్, లెక్చరర్లు ప్రత్యేక దృష్టి సారించారు. గత విద్యా సంవత్సరం రిజల్ట్స్ కంటే మెరుగ్గా సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే మార్చిలో పరీక్షలు ఉండగా, ఇప్పటికే 90 రోజుల ప్రణాళికను ప్రారంభించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతుల నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా ప్రశ్నల నిధిని తయారు చేయడమే కాదు, విద్యార్థులతో ప్రాక్టీస్ చేయిస్తున్నారు. అయితే, మధ్యాహ్న భోజనం, అల్పాహారం అందిస్తే విద్యార్థుల హాజరు శాతం పెరుగడమే కాదు, మెరుగైన ఫలితాలు సాధించేందుకు అవకాశముంటుందని చెబుతున్నారు. ఈ విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని కోరుతున్నారు.
జగిత్యాల, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : వచ్చే మార్చిలో జరగనున్న ఇంటర్మీడియెట్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియెట్ అధికారులు ఫోకస్ చేశారు. గతేడాది అనుకున్న రిజల్ట్ రాకపోవడంతో ఈసారి ఎలాగైనా సాధించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇంటర్‌బోర్డు రూపొందించిన 90 రోజుల ప్రణాళిక మేరకు జిల్లాల వారీగా ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. డిసెంబర్ చివరి నాటికి సిలబస్ పూర్తి చేసి, ప్రతి పాఠ్యాంశాన్నీ రివిజన్ చేయించే లక్ష్యంతో కాలేజీల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు ప్రత్యేక ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నారు.
బోర్డు ప్రణాళికను గత నెలలోనే ప్రారంభించారు. స్పెషల్ టైమ్‌టేబుల్ రూపొందించి, ప్రతి రోజూ ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట ప్రత్యేక తరగతులు బోధిస్తున్నారు. సంబంధిత సబ్జెక్ట్ లెక్చరర్లు పిల్లలకు అందుబాటులో ఉండి పర్యవేక్షించడంతోపాటు పునశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నారు. అలాగే, సబ్జెక్ట్‌ల వారీగా ప్రశ్నల నిధిని తయారు చేసి, అందుకు సంబంధించిన సమాధానాలతో నోట్స్‌ను పిల్లలకు అందించి ప్రాక్టీస్ చేయిస్తున్నారు.
స్లిప్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. అలాగే బ్లూప్రింట్ నమూనాలు, గత పరీక్షా పత్రాల్లోని ప్రశ్నలపై పిల్లలకు అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించి, వారిని కేటగిరి వారీగా విభజించి, వారి ఉత్తీర్ణత కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా 90 రోజుల పాటు విద్యార్థుల హాజరు ఉండేలా చూస్తున్నారు. ఆ మేరకు పేరెంట్స్, లెక్చరర్స్ సమావేశాలు కూడా నిర్వహించారు. విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురి కాకుండా ఉండేందుకు ప్రతి కాలేజీలో ఇద్దరు లెక్చరర్లతో కౌన్సెలింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
జగిత్యాల జిల్లా పరిధిలో అన్ని యాజమాన్యాల పరిధిలో 73 ఇంటర్మీడియెట్ కాలేజీలు ఉన్నాయి. అందులో 15 ప్రభుత్వ కాలేజీలు ఉండగా, 13 మోడల్ స్కూల్స్, 7కేజీబీవీ కాలేజీలు, 2గురుకులాలు, 5 మైనార్టీ గురుకులాలు, 5 ఇతర గురుకులాలు, 23 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. మొత్తం 14,247 మంది విద్యార్థులు ఈ యేడాది పరీక్షలు రాసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఫస్టియర్ జనరల్ విభాగంలో 6,490 మంది, వొకేషనల్ విభాగంలో 1035 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తంగా ఫస్టియర్ నుంచి 7,525 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇక సెకండియర్ జనరల్ విభాగంలో 5788 మంది, వొకేషనల్ విభాగంలో 934 మంది విద్యార్థులు మొత్తంగా 6722 మంది పిల్లలు ఎగ్జామ్స్ రాయనున్నారు.
జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న జూనియర్ కాలేజీలు మినహా మిగిలిన 36 సర్కారు విద్యా సంస్థలన్నీ రెసిడెన్షియల్ సంస్థలే. దీంతో విద్యార్థులకు అక్కడ మధ్యాహ్న భోజనం, అల్పాహారానికి సంబంధించిన ఇబ్బందులు లేవు. అయితే, 15 జూనియర్ కాలేజీల్లో మాత్రం మధ్యాహ్నం భోజనం పెద్ద సమస్యగా మారింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు ఇలాంటి పరిస్థితే ఉన్నది. ఉదయం కాలేజీకి వచ్చిన విద్యార్థులు సాయంత్రం వరకు భోజనం లేకుండా ఉండడం ఇబ్బంది అవుతున్నది.
దాంతో మధ్యాహ్నం తర్వాత కాలేజీల్లో విద్యార్థుల హాజరు శాతం తగ్గిపోతున్నది. దీని ప్రభావం ఇంటర్ ఫలితాలపై పడుతున్నది. దీంతో ప్రిన్సిపాళ్లు, జూనియర్ లెక్చరర్లు మధ్యాహ్న భోజనం, అల్పాహారం అందించడంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల లెక్చరర్లు సొంతంగా డబ్బులు వెచ్చించి అల్పాహారం, భోజనం అందించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ అది పూర్తిస్థాయిలో సాధ్యం కావడం లేదని వాపోతున్నారు. పాఠశాలల మాదిరి కాలేజీల్లోనూ మధ్యాహ్నం భోజనం అందించాలని కోరుతున్నారు. భోజనంతోపాటు అల్పాహారం అందిస్తే మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు. హాజరు శాతం పెరగడంతోపాటు మెరుగైన ఫలితాలు సాధించే అవకాశముందని చెబుతున్నారు.
విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడమే మాకు ముఖ్యం. కాలేజీలో చదువుతున్న ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. ఇప్పటికే అన్ని రకాలుగా సిద్ధం చేస్తున్నాం. సిలబస్ పూర్తి చేశాం. స్లిప్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నాం. త్రైమాసిక, షాణ్మాసిక పరీక్షలు నిర్వహించాం. ముఖ్యమైన ప్రశ్నలతో ప్రశ్నల నిధిని ఇచ్చాం. స్వల్పకాలిక ప్రశ్నలకు సంబంధించి జవాబులు పిల్లలతో ప్రాక్టీస్ చేయిస్తున్నాం. త్వరలోనే ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. పిల్లలకు అల్పాహారం, భోజన సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది.
– కచ్చు మేఘశ్యాం, సివిక్స్ లెక్చరర్ (బీర్పూర్ ప్రభుత్వ కాలేజ్)
వందశాతం ఫలితాలు సాధించాలన్నదే మా ఆశయం. కొడిమ్యాల జూనియర్ కాలేజీలో ఎప్పుడు మెరుగైన ఫలితాలే వచ్చాయి. ఈ యేడాది వంద శాతం ఫలితాలు సాధించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఇంటర్ కమిషనర్ ఇచ్చిన 90 రోజుల ప్లాన్‌తో పాటు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి ముందుకు సాగుతున్నాం. కాలేజీ మండల కేంద్రానికి దూరంగా ఉండడం, పిల్లలు గ్రామాల నుంచి బస్సులు, సైకిళ్లపై కాలేజీకి వస్తుంటారు.
ఉదయం వచ్చిన వారు సాయంత్రం ఐదున్నర వరకు ఉండడం ఇబ్బందే. దీనికి తోడు ఇతర ప్రాంతాల నుంచి ఉదయమే వస్తుండడంతో భోజనం చేసి, చేయక వచ్చేవారి సంఖ్యే అధికం. ఒకసారి భోజనం కోసం ఇంటికెళ్లిన విద్యార్థి మధ్యాహ్నం మళ్లీ రాడు. ఇది ఫలితాలపై ప్రభావం చూపుతుంది. మధ్యాహ్న భోజనం, ఉదయం సాయంత్రం వేళల్లో అల్పాహారం అందిస్తే బాగుంటుంది. మా సిబ్బంది సైతం కొంత సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. గ్రామస్తులు ముందుకు వచ్చి సాయం చేస్తే సంతోషం. ప్రభుత్వం సైతం భోజనం, అల్పాహారం అందించే విషయమై దృష్టి పెట్టాలి.
– కొంక వేణు, ప్రిన్సిపాల్ (కొడిమ్యాల జూనియర్ కాలేజ్)