Odela | ఓదెల, ఆగస్టు 13 : చదువు ఒక్కటే మన జీవితాలను మార్చేస్తుందని ట్రైనీ డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్ వనజా నాయక్ తెలిపారు పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ప్రపంచ అవయవదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవయవ, శరీర దానంపై అవగాహన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చదువు ఒక్కటే మనతోపాటు మన కుటుంబాన్ని మార్చేస్తుందని తెలియజేశారు. తాను కూడా ప్రభుత్వ బడులు, కాలేజీలలో చదువుకొని గ్రూప్-1 లో విజయం సాధించి డిప్యూటీ కలెక్టర్నైనట్లు చెప్పారు. విద్యార్థి జీవితం ఎంతో విలువైనదని, దానిని నిర్లక్ష్యం చేయరాదని ఉదాహరిస్తూ జీవితంలో ఉన్నత శిఖరాలను ఎదిగేందుకు పలు సూచనలు చేశారు.
తమ కుటుంబం పేదరికందని తాము ఎదగలేమనే నూన్యత భావాన్ని పెట్టుకోవద్దని చెప్పారు. మరణించిన అనంతరం కళ్లు, అవసరమైన అవయవ, శరీర దానాలను చేయడం మంచిదని సూచించారు. ఓదెల గ్రామంలో 270 మంది కండ్లను దానం చేయడం, అలాగే శరీర, అవయవ దానాలను చేసి రాష్ట్రస్థాయిలో ప్రథమంగా నిలబడాన్ని ఇక్కడి సదాశయ ఫౌండేషన్ నాయకులను అభినందించారు. అనంతరం అవయవ, శరీర దానంపై వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు మెమొంటో, బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి మెరుగు భీష్మా చారి, ఫౌండేషన్ సభ్యులు ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు, క్యాతం మల్లేశం, కస్తూర్బా గాంధీ విద్యాలయం ఎస్ఓ జ్యోతి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.