Early Bathukamma | వీణవంక, సెప్టెంబర్ 19 : వీణవంక మండలంలోని ఎంపీ, యూపీఎస్ హిమ్మత్ నగర్ పాఠశాల నందు ముందస్తు బతుకమ్మ సెలబ్రేషన్స్ అలరించాయి. ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారిని శోభారాణి, జెడ్పిహెచ్ఎస్ ఘన్ముక్ల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంఈఓ శోభారాణి బతుకమ్మను ఎత్తుకొని వచ్చి, స్థానిక ఉపాధ్యాయులు, మహిలళతో కలిసి బతుకమ్మ ఆడి పాడి సందడి చేశారు.
అనంతరం మండల విద్యాధికారి శోభారాణి హిమ్మత్ నగర్ గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ పాఠశాల లోపల విద్యార్థుల నమోదు పెంచుకోవడానికి ఉపాధ్యాయులకు సహకారం అందించాలని కోరారు. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ మాట్లాడుతూ మంచి యువ ఉపాధ్యాయులు హిమ్మత్ నగర్ పాఠశాలలో పనిచేస్తున్నారని, వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలని గ్రామస్తులకు సూచించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోనె సత్యం మాట్లాడుతూ బతుకమ్మ పండుగ అనేది తెలంగాణలో ముఖ్యమైన పండుగ అని, తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పండుగ ప్రధాన పాత్ర పోషించిందని, మహిళలు పూలతో జరుపుకునే ప్రత్యేకమైనటువంటి దేశంలోనే ఏకైక పండుగ బతుకమ్మ పండుగ అని తెలియజేశారు. గ్రామస్తులందరికీ ముందస్తు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వేణు రవళి, రజిత, క్రాంతి, అంగన్వాడీ టీచర్ లావణ్య, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.