ఓదెల, సెప్టెంబర్ 25 : దసరా పండుగ పూట గోపాల మిత్రలు పస్తులుండాల్సిన దుస్థితి వచ్చింది. ఐదు నెలలుగా జీతాలు రాక అవస్థలు పడాల్సి వస్తున్నది. ప్రతి నెలా అందే 11,050 గౌరవ వేతనం కూడా అందక కుటుంబాలు గడవడం కష్టంగా మారింది. గోపాలమిత్రలు 25 ఏళ్లుగా పశు సంవర్ధక శాఖలో ఔట్‌సోర్సింగ్‌పై పని చేస్తున్నారు. వీరిలో చాలా వరకు నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారే ఉన్నారు. వీరు గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు కృత్రిమ గర్భధారణ, గొర్రెలకు నట్టల నివారణ, ఎఫ్ఎండీ వాక్సినేషన్, తదితర సేవలందిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను చూసి తమ జీవితాలు మారిపోతాయని ఆశపడ్డారు. తమ బతుకుల్లో వెలుగులు నిండుతాయని సంబురపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు గడిచినా.. హామీల అమలు లేక తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నెల నెలా వచ్చే గౌరవం వేతనం కూడా ఐదు నెలల నుంచి అందడం లేదని వాపోతున్నారు. కుటుంబాలను పోషించుకునేందుకు అప్పులు చేయాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరుకే ప్రజా పాలన అని, ఆచరణలో మాత్రం ప్రజా వ్యతిరేక పాలనను తలపిస్తున్నదని ఆరోపించారు. ఇలా తమను గోస పెట్టవద్దని, నెలనెలా వేతనాలు అందించి ఆదుకోవాలని వేడుకున్నారు.
మమ్మల్ని గోస పెట్టవద్దు
మాకు ఐదు నెలలుగా వేతనాలు రావడం లేదు. మేం తీవ్ర ఇబ్బందులు పడుతున్నం. కుటుంబాలను పోషించుకోవడానికి అప్పులు చేస్తున్నం. పండుగ పూట దిక్కులు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా మమ్మల్ని గోస పెట్టవద్దు. ప్రభుత్వం దయచూపాలి. మాకు నెలనెలా వేతనాలు ఇప్పించాలి.
– గోపతి ప్రవీణ్ కుమార్, గోపాల మిత్ర జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ (పెద్దపల్లి)