COLLECTORATE | కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 27 : ఉమ్మడి పాలనలో నానా అగచాట్లు పడ్డ జిల్లా ప్రజలకు, స్వరాష్ట్రంలో మెరుగైన సేవలతో పాటు, పారదర్శక పాలన అందించేందుకు చేపట్టిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణం నత్తకే నడక నేర్పేలా నడుస్తోంది. పనులు మొదలైన ఏడాదిలోపు పూర్తి చేయాల్సి ఉండగా, పలు కారణాలతో నెమ్మదిగా కొనసాగింది. అయితే తమ ప్రభుత్వం వస్తే వెంటనే పూర్తి చేసి అన్ని కార్యాలయాలు ఓకే గొడుగు కిందికి తెస్తామంటూ ప్రకటించిన కాంగ్రెస్ నేతలు, ఇంటిగ్రేటెడ్ సముదాయ నిర్మాణానికి నిధులు విడుదల చేయించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
దీంతో, నిర్మాణ పనులు ఒకడుగు ముందుకు మూఢడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతున్నాయి. మరోవైపు ప్రయివేట్ భవనాల్లో కొనసాగుతున్న కార్యాలయాల అద్దె చెల్లించలేక అధికార యంత్రాంగం చేతులెత్తేస్తున్నది. దీంతో విధిలేక ఇతర చోట్ల ఉన్న ప్రభుత్వ భవనాల్లోకి కార్యాలయాలు తరలిస్తున్నారు. ఇందుకయ్యే ఖర్చు తడిసి మోపెడు అవుతుండగా, అది కూడా చెల్లించకపోవడంతో అధికారులు తలలుపట్టుకుంటున్నారనే చర్చ కొనసాగుతున్నది. పలు అవసరాల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు జిల్లాలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చే ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఓకే వ్యక్తి ఒకటికన్న ఎక్కువ పనులపై వచ్చి వేర్వేరు చోట్ల ఉన్న కార్యాలయాల్లో పనులు పూర్తి చేసుకునేందుకు నానా అగచాట్లు పడాల్సి వస్తున్నది. ఒక్కో సందర్భంలో అధికారులు కార్యాలయాల్లో అందుబాటులో లేక పదేపదే తిరగాల్సి ఉంటుంది. సకాలంలో తమ పనులు పూర్తి కాక వారి నుంచి తీవ్ర అసంతృప్తి వెల్లువెత్తుతున్నది.
నిర్మాణంలో మందగించిన వేగం
నాలుగు దశాబ్దాల క్రితం ప్రస్తుత కలెక్టరేట్ నిర్మాణం జరగగా, మెయింటెనెన్స్ లోపంతో శిథిలావస్థకు చేరింది. పలుచోట్ల పెచ్చులుడుతూ, కంప్యూటర్లపై, కార్యాలయాలలోని సిబ్బందిపై కూడా పడి గాయాలపాలవటం పరిపాటిగా మారింది. దీంతో, ఉమ్మడి జిల్లాలో అప్పటి కలెక్టర్ స్మితా సబర్వాల్ హయాంలో కెమికల్ కోటింగ్‌తో మరమ్మత్తులు నిర్వహించారు. ఏడాదిపాటు సమస్యలేకుండా ఉన్నా, అనంతరం యథావిధిగానే వర్షాకాలంలో నీరు కారటం, సిమెంట్ పెచ్చులూడటం మొదలైంది. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాలతో పాటు ఇక్కడ కూడా అన్ని హంగులతో కూడిన నూతన భవనం నిర్మించేందుకు గత బీఆరెస్ ప్రభుత్వం నిర్ణయించింది. 2021 చివరి త్రైమాషికంలో రూ.51 కోట్ల అంచనాలతో కొత్త కలెక్టరేట్ నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏడాదిలోపే గుత్తేదారు గ్రౌండ్, మొదటి, రెండు అంతస్థుల స్లాబ్ వేసి, గదుల పనులు కూడా పూర్తి చేశారు. అయితే, ఆనంతరకాలంలో జరిగిన పరిణామాలతో ప్రభుత్వం మారింది. గుత్తేదారుకు చెల్లించాల్సిన డబ్బులు పెండింగులో పెట్టగా, నిర్మాణ పనుల్లో కూడా వేగం మందగించింది.
కలెక్టర్ ఆదేశించినా.. స్పందించని అధికారులు, కాంట్రాక్టర్
ప్రభుత్వ కార్యాలయాలు వేర్వేరు చోట్ల ఉండి పాలనా పరమైన ఇబ్బందులు తలెత్తుతుండగా, కొత్త కలెక్టరేట్ నిర్మాణంపై కలెక్టర్ పమేలా సత్పతి గతేడాది ఆగస్టులో సంబంధిత గుత్తేదారు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. డిసెంబరులో కూడా మరోసారి సమీక్షించి, జనవరి నెలలో ప్రారంభించేలా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కొత్త సంవత్సరం మొదలై నాలుగు నెలలు గడుస్తున్నా, నిర్మాణ పనులు ఇంకా కొలిక్కి రాలేదు. కనీసం రాష్ట్ర ఆవిర్భావం రోజైనా ప్రారంభించుకునేలా పూర్తి చేయాలని ఆదేశించినా, పనుల్లో వేగం పెరగటం లేధు. ఇంకా ఫ్లోరింగ్ పనులే సాగుతుండగా, ఎలక్ట్రికల్, కలరింగ్, ప్లంబింగ్, శానిటేషన్, డోర్స్ తో పాటు ప్రధాన పనులైన గార్డెనింగ్, కలెక్టరేట్ చుట్టూ రహదారుల నిర్మాణం, ఎలివేసన్, తదితర పనులు మొదలే కాలేదు. వీటితోపాటు కలెక్టర్, ఇద్దరు అదనపు కలెక్టర్ల క్యాంపు కార్యాలయాలు, రెండు మీటింగ్ హాళ్ల నిర్మాణం కూడా చేయాల్సి ఉన్నది. ఇవన్నీ ఇప్పట్లో పూర్తవటం అసాధ్యమని ప్రభుత్వ అధికారులే పేర్కొంటుండటం గమనార్హం. అయితే, ముందుగా ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ పూర్తి చేసి, ఇతర చోట్ల కొనసాగుతున్న కార్యాలయాలను తరలించి, ప్రజల ఇబ్బందులకు పరిష్కారమార్గం చూపాలనే డిమాండ్ అన్నివర్గాల నుంచి వస్తుండగా, జాన్ 2 కు మరో నెల రోజులు మాత్రమే ఉండగా, ఈలోపు ఆ పనులైన పూర్తయ్యేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.