మానకొండూరు రూరల్, అక్టోబర్ 30 : పొట్టచేత పట్టుకొని బతుకుదెరువు కోసం వచ్చిన ఆ కుటుంబం మొంథా తుపాను ధాటికి సర్వం కోల్పోయి రోడ్డున పడింది. నిరంతరం కురుస్తున్న వర్షాలకు లోయర్ మానేరు గేట్లు ఎత్తడంతో వారు ఉపాధి కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే..ఏపీలోని చిత్తూరు జిల్లా పలమనేరు మండలానికి చెందిన మేన్పడే డేవిడ్ – ధనలక్ష్మి బాతులు పెంచుతూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని శ్రీనివాస్ నగర్ గ్రామంలో మానేరు తీర ప్రాంతంలో నేషనల్ హైవే బ్రిడ్జి కింద బాతులతో బతుకుతెరువు కోసం వచ్చి పదిమంది సభ్యులతో కలిసి మానేరు వాగు ఒడ్డున నేషనల్ హైవే బ్రిడ్జి కింద జీవనం కొనసాగిస్తున్నారు.
బుధవారం పొద్దంతా కురిసిన వర్షం కురవడంతో అధికారులు 14 గేట్లు ఎత్తడంతో నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. ఉపాధి కోసం వచ్చిన బాతుల కుటుంబాలు పడుకొని ఉండగా రాత్రి ఒంటి గంటకు ప్రవాహం ఎక్కువ కావడంతో వీరు నివాసం ఉంటున్న డేరాల లోపలికి నీళ్లు చేరాయి. దీంతో అందులో ఉండే బాతు పిల్లలు ప్రవాహానికి కొట్టుకపోవడంతో కుటుంబ సభ్యులందరూ ఒడ్డుకు చేరుకున్నారు. 20 వేల పిల్లలకు గాను 4 వేల బాతు పిల్లలను రక్షించి ఒడ్డుకు చేరుకున్నారు. బాతుల పెంపకంతో బతుకీడుస్తున్న తమకు ఉన్న ఆధారం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.