Extend passenger train | గోదావరిఖని: బల్లార్షా ప్యాసింజర్ రైలును సికింద్రాబాద్ వరకు పొడిగించి నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ రైల్వే డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉదయ్ నాథ్ ను డీఆర్యూసీసీ (రైల్వే బోర్డు మెంబర్) అనుమాస శ్రీనివాస్ (జీన్స్) కోరారు. సికింద్రాబాద్ రైలు నిలయంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ ను ఆయన గురువారం కలిసి ప్రస్తుతం బల్లార్షా నుండి కాజీపేట వరకు నడుస్తున్న ప్యాసింజర్ రైలును ప్రజల అవసరాల రీత్యా సికింద్రాబాద్ వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల ఎంతో మందికి సౌకర్యంగా ఉంటుందని వివరించారు.
భాగ్యనగర్ రైలు నడుస్తున్న సమయంలోనే ప్యాసింజర్ రైలు ఉండడం వల్ల ఇబ్బందికరంగా ఉందని, రామగుండంలో ఉదయం ఎనిమిది గంటలకు ప్యాసింజర్ రైలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. బల్లర్షా ప్యాసింజర్ రైలు సికింద్రాబాద్ వరకు పొడగింపు సమయాల మార్పు త్వరలోనే పరిష్కారం చేస్తామని డిప్యూటీ జనరల్ మేనేజర్ హామీ ఇచ్చినట్లు శ్రీనివాస్ తెలిపారు. వినతి పత్రం సమర్పించిన వారిలో కాంగ్రెస్ నాయకుడు కొంగర శ్రీనివాస్ ఉన్నారు.