Godavarikhani | కోల్ సిటీ, జూన్ 21: ”నా పేరు ఇంజం మొగిలి, 65 ఏళ్ల వయసు. 35 ఏళ్లుగా రెక్కల కష్టంను నమ్ముకొని చెమటోడ్చి సిమెంట్ గాజులు, తులసీ గద్దెలు తయారు చేసుకొని విక్రయిస్తూ జీవిస్తున్నా… ఆడపిల్ల పెళ్లి చేసి కట్నం కింద ఉన్న ఇల్లు రాసిచ్చిన.. ఇక ఇదే నా బతుకు దెరువు.. ఇప్పుడు నర్సింగ్ కాలేజీ చేస్తుందనీ… ఉన్నపలంగా ఖాళీ చేయమని చెబుతున్నారు.. ఈ వయసులో మరోచోటకు పోలేని పరిస్థితి.. అయ్యా ఎమ్మెల్యే గారూ.. మీరే పెద్ద మనసు చేసుకొని ఇక్కడే ఓ మూలకు అవకాశం ఇస్తే… ఉన్నంతకాలం ఇదే ఆధారంగా బతుకు వెళ్లదీస్తా..” అంటూ వచ్చిపోయే వారిని ప్రాధేయ పడుతున్నాడు.
గోదావరిఖని ఎల్.బీ నగర్ లో గల మాతంగి కాంప్లెక్స్ ఎదురుగా రోడ్డు ప్రక్కన చెట్టు కింద మూడు దశాబ్దాలుగా సిమెంట్ గాజులు పోసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. ఆ ప్రక్కనే ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఏర్పాటు అవుతుండటంతో తనను ఖాళీ చేయమని చెబుతున్నాడనీ, ఆరోగ్యం కూడా సరిగ్గా సహకరించని ఈ వయసులో నా పొట్ట మీద కొట్టవద్దని వేడుకుంటున్నాడు.
ఇక్కడే ఓ మూలన ఉండేందుకు కనికరించాలని ప్రాదేయ పడుతున్నాడు. దారి వెంట వచ్చిపోయే వారికి తన పరిస్థితిని చెప్పుకుంటూ కన్నీటి పర్యంతం అవుతున్నాడు. కళాశాల వస్తే నలుగురికి పరోక్షంగా ఉపాధి వస్తుందనుకుంటే ఉన్నదే పోయేలా చేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ వృద్ధాప్యంలో ఉన్న ఉపాధి పోతే రేపటి సంది బతుకుడెట్ల అని తలచుకొని దిగాలు పడుతున్నాడు. స్థానిక ఎమ్మెల్యే కరుణించి తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.