Donate blood | కోల్ సిటీ, జూలై 27: ఆపదలో ఉన్న ఓ వ్యక్తికి రాక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన యువకుడి ఔదార్యంను పలువురు వైద్యులు అభినందించారు. కమాన్ పూర్ మండలం పెంచికల్ పేటకు చెందిన బుట్టి సదానందం ట్రాన్స్ కో సంస్థ లో లైన్ మెన్ ఉద్యోగం చేస్తున్నాడు. వృత్తి లైన్ మెన్ గా.. ప్రవృత్తి హెల్ప్ లైన్ గా గ్రామంలో సదానందంకు పేరుంది. ఎవరైనా.. ఎక్కడైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు.. వెంటనే వెళ్లి రక్తదానం చేయడం అంటే సదానందంకు ఇష్టం.
అలా ఇప్పటికీ అనేకసార్లు రక్తదానం చేసినట్లు తెలిపాడు. ఈ నేపథ్యంలో గోదావరిఖనికి చెందిన ఓ వ్యక్తి రక్త హీనతతో బాధపడుతూ గోదావరిఖని ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో అత్యవసరంగా ఓ పాజిటీవ్ రక్తం ఎక్కించాల్సి ఉంది. ఆదివారం సోషల్ మీడియా ద్వారా కుటుంబ సభ్యులు దాతలకు విన్నపం చేశారు. ఈ విషయం గోదావరిఖనిలోని తన మిత్రుల ద్వారా తెలుసుకొని కరీంనగర్ లో ఉన్న సదానందం హుటాహుటినా గోదావరిఖని ఆస్పత్రికి వచ్చి తన ఓ పాజిటీవ్ రక్తదాసం చేసి ఉదారతను చాటుకున్నాడు. ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడిన సదానందంను ఆస్పత్రి వైద్యులతో పాటు కుటుంబ సభ్యులు, మిత్ర బృందం ప్రత్యేకంగా అభినందించారు.