Ramagiri | రామగిరి, జూన్ 13 : రామగిరి మండల కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లోని పలు ఏటీఎంలలో నగదు కొరత కారణంగా తరచూ ‘నో మనీ’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. డబ్బులు డ్రా చేసుకోవడానికి వచ్చే వినియోగదారులు నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వారాంతాలు, సెలవు దినాల్లో నగదు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా సెంటినరీ కాలనీలోని ఓ ఏటీఎం వద్ద శనివారం ఆసక్తికర దృశ్యం కనిపించింది.
నగదు లేని కారణంగా వినియోగదారుల రాకపోకలు తగ్గిపోవడంతో ఏటీఎం కేంద్రం ప్రవేశ ద్వారం వద్ద రెండు వైపులా శునకాలు పడుకుని కునుకు తీస్తూ కనిపించాయి. ఏటీఎంకు కాపలాగా ఉన్నట్లుగా అవి అక్కడే సేదతీరడం స్థానికుల దృష్టిని ఆకర్షించింది. ఈ దృశ్యాన్ని గమనించిన పలువురు స్థానికులు హాస్యంగా స్పందిస్తూ ఏటీఎంలో డబ్బులు లేకపోయినా శునకాలు మాత్రం కాపలా కాస్తున్నాయి అంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు తరచూ నగదు కొరత ఏర్పడకుండా సంబంధిత బ్యాంకు అధికారులు చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. ఏటీఎంలలో నగదు అందుబాటులో ఉండేలా పర్యవేక్షణ పెంచాలని వారు విజ్ఞప్తి చేశారు