మీకు బైక్, కారు, ఇతర వాహనాలు ఉన్నాయా..? రంగురంగుల పాత నంబర్ ప్లేట్లు పెట్టుకొనే ప్రయాణిస్తున్నారా..? ఇప్పటివరకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ బిగించుకోలేదా..? అయితే మీకు జరిమానా.. లేదా..? మీ బండి సీజ్ అయ్యే ప్రమాదం ఉన్నది. కాలం చెల్లిన వాహనాలను కట్టడి చేయడం, రోడ్డు ప్రమాదాల నివారణకు కొన్నాళ్ల క్రితమే ఈ విధానాన్ని తప్పనిసరి చేసిన ప్రభుత్వం, వచ్చే సెప్టెంబర్ 30 వరకు డెడ్‌లైన్ విధించింది. అయితే గడువు దగ్గరపడుతున్నా అవగాహన కల్పించడంలో ఆర్టీఏ అధికారులు నిర్లక్ష్యం చూపుతుండడం విమర్శలకు తావిస్తున్నది.
తిమ్మాపూర్, జూలై 28 : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అన్ని వాహనాలు కలిపి సుమారు పది లక్షల వరకు ఉంటాయి. అయితే చాలా వాహనాలు కాలం చెల్లినా, ఫిట్నెస్ లేకున్నా రోడ్లపై తిరగడంతో ప్రమాదాలు జరుగుతుండడాన్ని ప్రభుత్వం గుర్తించింది. మరికొందరైతే ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినప్పుడు ఫైన్ పడకుండా ఉండేందుకు నంబర్ సరిగా కన్పించకుండా ప్లేటును వంచడం, నంబర్లో ఏదో ఒకటి చెరిపేయడం, అసలు నంబర్లే కన్పించకుండా స్టిక్కర్ వేయడం, ఇంకొందరైతే నంబర్ ప్లేటునే తొలగించడం లాంటివి చేస్తున్నారు. ఇలాంటి చర్యలతో ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
వీటన్నింటికీ చెక్ పెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని వాహనాలు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లను బిగించుకోవాలని ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలో 2019 నుంచి కొత్త వాహనానికి హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్‌ను బండి కొన్న తర్వాత షోరూంకే అందజేస్తుండగా, ఇప్పటివరకు 1,71,111 వెహికిల్స్‌కు బిగింపు జరిగింది. అంతకుముందు కొన్న వాహనాలు తప్పనిసరిగా బిగించుకోవాలని సర్కులర్ జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలో 15ఏండ్లు దాటిన, కాలం చెల్లిన వాహనాలు 8,123 ఉన్నట్లు తెలుస్తుండగా, వచ్చే సెప్టెంబర్ 30వరకు గడువు ఉంది. అప్పటిలోగా అమర్చుకోకపోతే జరిమానా, బండి సీజ్ చేసే ప్రమాదమున్నది.
ఈ నంబర్ ప్లేట్ కోసం బైక్‌లకు 300, ఆటోలు 350, కార్లు 600, కమర్షియల్ పెద్ద వాహనాలకు 600వరకు రుసుం చెల్లించాల్సి ఉండగా, ఆన్లైన్లో https:\\bookmyhsrnp.com స్లాట్ బుక్ చేసుకుంటే నంబర్ ప్లేట్ ఎక్కడ తీసుకోవాలో వస్తుంది. అనంతరం సదరు షోరూంకు వెళ్లి నంబర్‌ప్లేట్ వాహనానికి అమర్చి ఆ ఫొటోను తిరిగి వెబ్సైట్లో అమర్చాల్సి ఉంటుంది. కాగా, సెప్టెంబర్ నెలాఖరులోపే గడువు ఉన్నప్పటికీ ఆర్టీఏ అధికారులు అవగాహన కల్పించడంలో విఫలమవుతుండడం విమర్శలకు తావిస్తున్నది. మరోవైపు పాత వాహనాలు ఆన్లైన్లో లేకపోవడంతో స్లాట్ బుక్ కావడం లేదని, ఏం చేయాలో తెలియడం లేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.