Godavarikhani | కోల్ సిటీ, డిసెంబర్ 24: అధికార పార్టీ నాయకుల అనాలోచిత నిర్ణయాలు, విధ్వంస పాలనతో రామగుండం చెల్లా చెదరవుతోందనీ, అందుకు నా జీవితమే మొదటి ఉదాహరణ అని కూల్చివేత బాధితుడు ఎన్ఐపీ జాతీయ నాయకులు అశోక్ వేముల ఆరోపించారు. గోదావరిఖని గణేశ్ చౌక్ వద్ద సత్యగ్రహ దీక్షకు సంఘీభావం ప్రకటించి మాట్లాడారు.
గోదావరిఖని ఆశోకనగర్ వద్ద ఏళ్ల తరబడి దుకాణం పెట్టుకొని జీవనోపాధి పొందుతున్నాననీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక స్థానిక ఎమ్మెల్యే నియంత ధోరణితో నిర్దాక్షిణ్యంగా నా దుకాణం కూల్చివేశారనీ, హైకోర్టులో పిటిషన్ ఉన్నప్పటికీ రాత్రికి రాత్రే కూల్చివేసి నన్ను రోడ్డున పడేశారని వాపోయాడు. ఆ తర్వాత తాను ఇక్కడ నుంచి ప్రక్క జిల్లా మంచిర్యాలకు వెళ్లి అక్కడ మళ్లీ వ్యాపారం ఏర్పాటు చేసుకున్నాననీ, మిగతా వ్యాపారులకు సైతం తన లాంటి దుస్థితి రావొద్దంటే అందరు సంఘటితంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఆకుల మల్లేశం 30 యేళ్ల నుంచి తమల పాకులు అమ్ముకుంటూ పైసా పైసా కూడబెట్టి కూతురు పెళ్లి కోసం దాచుకున్న నగలు అమ్మి చౌరస్తా లో రూ. 20లక్షలతో షాపు కట్టుకుంటే అర్ధరాత్రి కూల్చివేయడమే గాకుండా పైగా గుర్తు తెలియని దుండగులు కూల్చివేశారని చెప్పడం విచారకరమన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సాధారణ కింది స్థాయి కూడా కూల్చివేతకు ముందు బాధితురాలు జయసుధకు ఫోన్ చేసి ఎమ్మెల్యేను మాట్లాడుతున్నా అన్నాడంటే రామగుండంకు ఎంతమంది ఎమ్మెల్యేలో అర్ధం కావడం లేదన్నారు. ప్రజలంతా సంఘటితమై ఈ కూల్చివేతలకు గుణపాఠం చెప్పాలన్నారు. లేదంటే తనలాగే ఊరు విడిచి వెళ్లిపోయే పరిస్థితి అందరికి వస్తుందన్నారు.