Oil farm Gardens | పెగడపల్లి: పంట సాగు చేసి 30 నెలలు దాటిన ఆయిల్ ఫామ్ తోటల్లో పూతను తొలగించొద్దని జగిత్యాల డివిజన్ ఉద్యానవన శాఖ అధికారి స్వాతి రైతులకు సూచించారు. పెగడపల్లి మండలం నంచర్ల, ఆరవల్లి, సుద్దపల్లి, పెగడపల్లి గ్రామాల్లో ఆయిల్ ఫామ్ తోటలను ఆమె శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 30 నెలల వయస్సు నిండిన ఆయిల్ పామ్ తోటల్లో గెలల ఎదుగుదలకు గాను, వాటి పరాగ సంపర్కం కోసం త్వరలోనే పురుగులను విడుదల చేస్తామని వివరించారు.
కొన్ని చోట్ల చెట్ల ఆకులను రైతులు తొలగిస్తున్నారని, ఇలా చేవద్దని, దీని వల్ల మొగ పూత ఎక్కువగా వచ్చే అవకశం ఉందని సూచించారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో పండ్ల తోటల పెంపకానికి ప్రోత్సాహకం అందిస్తున్నామని, సాగు చేసే రైతులకు 40 శాతం వరకు సబ్సీడీ ఇస్తున్నట్లు స్వాతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన విస్తరణ అధికారి అనిల్, రైతు సంఘం నాయకులు రాజేశం, సాగర్ రావు ఉన్నారు.