KARIMNAGAR | కలెక్టరేట్, ఏప్రిల్ 10 : ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యంలో తరుగు, కోత విధించకుండా, గత పద్ధతిలోనే కొనుగోళ్లు చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లపై పౌరసరఫరాల శాఖ అధికారులు, రైసుమిల్లర్లతో లెక్టరేట్ కాన్ఫరెన్సు హాలులో గురువారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రాల్లో రైతులకు సరైన వసతులు కల్పించాలని సూచించారు. తేమ, తాలు పేరిట కోతలు పెట్టకూడదన్నారు. రైతులు ఎక్కువ కాలం కళ్లాల వద్ద నిరీక్షించకుండా చూడాలన్నారు. ధాన్యం రవాణా చేసే లారీలు వెంటవెంటనే ధాన్యాన్ని మిల్లులకు తరలించాలన్నారు. మిల్లర్ల సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. జిల్లాలో గత పంట సీజన్లలో ఎలాంటి కోతల్లేకుండా ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరిగిన విషయాన్ని గుర్తు చేశారు.
ధాన్యం కొనుగోలులో సాకులు చూపుతూ కోతలు పెట్టద్దని మిల్లర్లకు సూచించారు, పొడి ధాన్యాన్ని మాత్రమే కేంద్రాలకు తెచ్చేలా రైతులు జాగ్రత్తలు పాటించాలన్నారు. నాణ్యమైన ధాన్యం మాత్రమే కేంద్రాలకు తెచ్చేలా హార్వెస్టర్లకు గతంలోనే సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. షెడ్యూల్ హార్వెస్టింగ్ పై కూడా అవగాహన కల్పించడంతో ఈసారి మిల్లర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని అన్నారు.
కొనుగోలు చేసిన ధాన్యం ఎప్పటికప్పుడు కేంద్రాల నుంచి మిల్లులకు తరలించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రజనీకాంత్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి నర్సింగారావుతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.