Collector Koya Sri Harsha | పెద్దపల్లి, నవంబర్ 3 : జిల్లాలోని ఏ ప్రభుత్వ విద్యా సంస్థలో కట్టెల పొయ్యి పై వంట చేయడానికి వీల్లేదని కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టం చేశారు. ఈనెల 25 నాటికి జిల్లాలోని ప్రభుత విద్యా సంస్థకు అవసరం మేరకు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద కొత్త గ్యాస్ కనెక్షన్ అందించాలని అధికారులను ఆదేశించారు. గ్యాస్ కనెక్షన్లకు అసరమైన నిధులను కలెక్టరేట్ నుంచి చెల్లిస్తామని చెప్పారు. కలెక్టరేట్లో సోమవారం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకంపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటూ పేదలందరికీ గ్యాస్ కనెక్షన్ వచ్చేలా చూడాలన్నారు. గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ వారీగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా కొత్త గ్యాస్ కనెక్షన్ కోసం వచ్చిన దరఖాస్తులను పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీనాథ్, సీ సెక్షన్ సూపరింటెండెంట్ ప్రకాష్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఖాళీ సీట్ల భర్తీ..
జిల్లాలోని కేజీబీవీ, ఆదర్శ పాఠశాలల్లో(మోడల్ స్కూల్) ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయటానికి విద్యార్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. 10 శాతం వరకు సీట్లు ఖాళీగా ఉన్నాయని, ఆసక్తి, అర్హత గల విద్యార్థులు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలని సూచించారు.