Ramagundam | కోల్ సిటీ, జూన్ 11: రామగుండం నగర పాలక సంస్థలో ఇదివరకు ఉన్న 50 డివిజన్లను 60 డివిజన్లుగా విభజిస్తు పారదర్శకంగానే వార్డుల పునర్విభజన ప్రక్రియ జరుగుతుందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషనర్ జే.ఆరుణ శ్రీ తెలిపారు. నగర పాలక సంస్థ కార్యాలయంలోని ఆమె చాంబర్ లో బుధవారం వివరాలు వెల్లడించారు. ప్రభుత్వం నుంచి ఆదేశాల మేరకు కార్పొరేషన్ చుట్టు పక్కల గల వెంకట్రావుపల్లి, లింగాపూర్, అక్బర్ నగర్, ఎల్కలపల్లి గేట్ గ్రామాలను విలీనం చేశామనీ, అప్పటి వార్డుల ఓటర్ల కంటే కాస్త తగ్గుదల జరిగిందనీ, ఒక్కో డివిజన్ ను 3వేల నుంచి 3800 వరకు ఓటర్లు కలిగేలా విభజనకు సంబంధించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేశాక, ఈ వారం రోజుల గడువులో ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నుంచి బుధవారం గడువు ముగిసేలోగా 30 కి పైగా అభ్యంతరాలు వచ్చాయన్నారు.
వీటిని ఎప్పటికప్పుడు పరిశీలించడంలో భాగంగా వార్డు ఆఫీసర్లచే సర్వే చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. ప్రస్తుతం 60 డివిజన్లలో వార్డు ఆఫీసర్లు ఇంటింటికి వెళ్లి పరిశీలన జరుపుతున్నారనీ, భౌగోళిక, హద్దులను సైతం పరిగణలోకి తీసుకొని టౌన్ ప్లానింగ్ విభాగంచే డివిజన్ మ్యాప్ ల ను రూపొందించి ఆ జాబితాను జిల్లా కలెక్టర్ కు నివేదిస్తామని తెలిపారు. అనంతరం సీడీఎంఏ నుంచి ప్రిన్సిపల్ సెక్రెటరీ వరకు పరిశీలించి తుది జాబితాను ప్రకటిస్తారని తెలిపారు. ఇదిలా ఉండగా కార్పొరేషన్ లోని వార్డుల విభజనకు సంబంధించి ముసాయిదా తప్పుల తడకగా ఉందని అనేక ఆరోపణలు వచ్చాయి. పలు డివిజన్లలో పెద్ద సంఖ్యలో ఓట్లు గల్లంతైనట్లు గణంకాలు ఉన్నాయి.
ఐతే ఆయా డివిజన్ల నుంచి అభ్యంతరాల స్వీకరణకు పెద్దగా స్పందన కానరాలేదు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కు సంబంధించి డివిజన్లలో ప్రచారం లేదు. కమిషనర్ ఆదేశాల మేరకు వార్డు ఆఫీసర్లు క్షేత్ర పరిశీలనలో నిర్లక్ష్యం ప్రదర్శించారు. దీనితో ప్రజల నుంచి అంతగా అభ్యంతరాలు రాలేదు. కేవలం ఆశావహులు మాత్రమే తమ డివిజన్లలో గల్లంతైన ఓటర్ల గురించి అభ్యంతరాలు అందజేశారు. చివరకు అంతా ఊహించినట్టుగానే ఇదే ముసాయిదాను మమా.. అనిపించే అవకాశాలు లేకపోలేదని పలువురు చర్చించుకుంటున్నారు.