Yoga Competitions | కోల్ సిటీ, సెప్టెంబర్ 10 : పెద్దపల్లి జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగా పోటీలు అట్టహాసంగా జరిగాయి. గోదావరిఖని శ్రీరామ విద్యానికేతన్ పాఠశాల ఆవరణలో గురువారం అండర్ 8 నుంచి 21 వరకు బాల బాలికలకు వేర్వేరు విభాగాల్లో నిర్వహించారు. కాగా ఈ పోటీలకు పెద్దపల్లి జిల్లా నలుమూలల నుంచి సుమారు 60 మంది బాల బాలికలకు ఉత్సాహంగా పాల్గొని యోగా విన్యాసాలను ప్రదర్శించారు. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఈనెల 12, 13 తేదీల్లో కరీంనగర్ లో జరగబోయే రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
కాగా, పోటీలకు యోగా జిల్లా సెక్రెటరీ సూర్యదేవర జ్యోతి సమన్వయం చేయగా, న్యాయ నిర్ణేతలుగా ఏ విజయకుమార్, హసీనా బేగం వ్యవహరించారు. విద్యార్థుల్లో యోగా పట్ల ఆసక్తిని పెంపొందించే ఉద్దేశంతోనే ఈ పోటీలు నిర్వహించినట్లు నిర్వాహకులు సూర్యదేవర వెంకటేశ్వరరావు తెలిపారు. యోగా వల్ల మానసిక, శారీరక దారుఢ్యం, మేధోశక్తి పెంపొంది పిల్లలు చురుకుగా విద్యలో రాణిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యోగా అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.