Chigurumamidi | చిగురుమామిడి, జూలై 22 : రేషన్ దారులకు మరోసారి మూడు నెలల బియ్యం ముందుగానే ఇవ్వడం జరుగుతుందని తహసీల్దార్ కొండం కనకయ్య తెలిపారు. మండల రెవెన్యూ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ కళావతితో కలిసి ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. గడిచిన ఏప్రిల్, మే, జూన్ నెలలకు సరిపడా బియ్యం ఒకేసారి అందించగా, తాజాగా పౌరసరఫరాల శాఖ అధికారులు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు గాను మూడు నెలలు ఒకేసారి పంపిణీ చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.
చిగురుమామిడి మండలంలో 17 గ్రామాలకు గాను 27 చౌక ధరల దుకాణాలు (రేషన్ షాపులు) ఉండగా, 14,564 రేషన్ కార్డు దారులు ఉన్నారన్నారు. మండలంలో ఒక్కో నెలకు 41, 368 వేల క్వింటాళ్లు గ్రామాల వారిగా బియ్యం పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఒకేసారి పెద్ద మొత్తంలో బియ్యం పంపిణీ చేయాల్సి ఉండడంతో మండల స్థాయిలో స్టాక్ పాయింట్లకు బియ్యం సరఫరా చేసేందుకు అధికారులు ప్రత్యేక రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లు తహసీల్దార్ తెలిపారు.