గురుకుల స్కూల్ సిబ్బందిపై కాంగ్రెస్ సర్కారు కత్తిగట్టింది. పార్ట్‌టైం బోధన, బోధనేతర ఉద్యోగుల బతుకులను రోడ్డుపాలు చేసింది. రాష్ట్రంలోని ఖాళీలన్నీ భర్తీ చేస్తూ యువత కలలు సాకారం చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ ప్రభుత్వం, రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లోని ఆరు వేల మందిని తొలగించి పొట్టకొట్టింది. మంగళవారం గురుకులాల పాఠశాల కార్యదర్శి మౌఖిక ఆదేశాలు జారీ చేయడం, బుధవారం విధుల్లోకి తీసుకోకపోవడంతో బాధితులు మండిపడుతున్నారు. ప్రభుత్వం తమ జీవితాలను ఆగం చేయొద్దని వేడుకుంటున్నారు. పెద్దపల్లిలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించి, పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు.
పెద్దపల్లి, సెప్టెంబర్ 4(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 267 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో దాదాపు 6వేల పార్ట్‌టైం బోధన, బోధనేతర సిబ్బంది ఏండ్లుగా పనిచేస్తున్నారు. వారిలో సబ్జెక్ట్ అసోసియేట్స్ పార్ట్‌టైం, పార్ట్‌టైం టీచర్లు, అసిస్టెంట్ కేర్ టేకర్లు, స్పెషల్ టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్, 33 సెంటర్ ఆఫ్ ఎక్సలెంట్(సీవోఈ)లలో 216మంది సబ్జెక్ట్ అసోసియేట్స్, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో డాటా ఎంట్రీ ఆపరేటర్లు పనిచేస్తుండగా, వారి కొలువులను ప్రభుత్వం ఎకాఎకిన తొలగించింది. ఈ మేరకు మంగళవారం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కార్యదర్శి అలుగు వర్షిణి మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.
బుధవారం పాఠశాలలకు వెళ్లిన సిబ్బందిని లోపలికి అనుమతించకపోవడంతో ఉద్యోగులు కంగుతిన్నారు. తమ పొట్టకొట్టొద్దని, ఉద్యోగాల్లోకి తీసుకోవాలని పోరుబాట పట్టారు. ప్రభుత్వం అకారణంగా ఉద్యోగాలు తొలగించిందంటూ పెద్దపల్లి జిల్లాలోని బాధితులు బుధవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు. తక్షణమే తమను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ శ్రీ హర్షకు వినతి పత్రాన్ని సమర్పించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి వినతి పత్రాలను అందజేశారు.
రోడ్డున పడేయద్దు
నేను పెద్దపల్లి బాలుర గురుకుల స్కూళ్లో 2016నుంచి వాచ్‌మెన్‌గా పని చేస్తున్న. ఉన్నట్టుండి ఒక్కసారిగా నన్ను ఉద్యోగానికి రావద్దని అంటున్నరు. నేనేం తప్పు చేసిన. నేను ఉద్యోగం చేయకపోతే నా కుటుంబం ఆగమైతది. దయచేసి నన్ను రోడ్డున పడేయద్దు. నేను వేరే పని చేయలేను. నాకు ఇందులోనే ఉద్యోగం కల్పించాలి.
– బొడ్డు మల్లయ్య, వాచ్మెన్, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల (పెద్దపల్లి)
రెగ్యులరైజ్ చేయాలి
నేను రెండేండ్లుగా మంథని గురుకుల పాఠశాలలో టీజీటీ బయోలాజికల్ సైన్స్ బోధకుడిగా పనిచేస్తున్న. ఉన్నట్టుండి నన్ను బుధవారం విధులకు హాజరు కావద్దన్నరు. నాకు ఇద్దరు పిల్లలు. కొలువులోంచి తీసేయడంతో నా కుటుంబం రోడ్డున పడింది. ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి. ఉద్యోగాల్లోకి తీసుకొని రెగ్యులరైజ్ చేయాలి.
– అక్కపాక లింగయ్య, అధ్యాపకుడు (మంథని)
గెస్ట్, పార్ట్ టైం ఉద్యోగులను కొనసాగించాల్సిందే
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
కార్పొరేషన్, సెప్టెంబర్ 4: గురుకుల పాఠశాలల్లో సుదీర్ఘంగా పనిచేస్తున్న గెస్ట్, పార్ట్ టైం ఉద్యోగులను కొనసాగించాల్సిందేనని, కొలువుల నుంచి తొలగిస్తే ఊరుకునేది లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన జారీ చేశారు. గురుకులాల్లో విద్యార్థులు కలుషిత ఆహారం తిని మృతి చెందిన ఘటనలు మరువక ముందే, ప్రభుత్వం గెస్ట్, పార్ట్ టైం ఫ్యాకల్టీలను తొలగించడం సరికాదన్నారు. పాతవారిని తొలగిస్తూ, కొత్త అభ్యర్థుల వద్ద 50వేల నుంచి లక్ష వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల ఉన్నతాధికారులు అభ్యర్థుల నుంచి డబ్బు వసూలు చేసి గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు భర్తీ చేశారనే ఆరోపణలు వస్తున్నాయని, దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కారు అనాలోచిత నిర్ణయాలతో దాదాపు 2లక్షల మంది ఎస్సీ విద్యార్థుల భవిష్యత్ అంధకారంలో పడిందని, 38ప్రతిభా పాఠశాలలు, 24క్రీడా అకాడమీలు, మ్యూజిక్ సూల్, సైనిక్ సూల్, మహిళా సైనిక్సూల్, కళాశాల, న్యాయ కళాశాల, 35ఒకేషనల్ కళాశాలలు మూతపడే ప్రమాదం ఏర్పడిందని విచారం వ్యక్తం చేశారు. తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, లేదంటే ఆందోళనలు తప్పవని హెచ్చరించారు.