తునికాకు సేకరణకు ప్రభుత్వ ప్రోత్సాహం కరువైంది. ఏండ్లు గడుస్తున్నా ఆకు ధర పెంచకపోవడం, ఒక్కో కట్టకు 3 మాత్రమే చెల్లిస్తుండడంతో ఏజెన్సీ ప్రజల్లో నిరాసక్తత వ్యక్తమవుతున్నది. పెద్దపల్లి, మంథని రేంజ్‌లలో ఈ సీజన్లో 76లక్షల ఆకుల సేకరణే లక్ష్యంగా ఏడు యూనిట్లక్లు (47 కల్లాలు) టెండర్లు పిలువగా, కేవలం మూడు యూనిట్లు (18 కల్లాలు) మాత్రమే ఖరారు కావడం పరిస్థితికి అద్దంపడుతున్నది. రేటు పెంచితేనే తమకు గిట్టుబాటు అవుతుందని, ఆ దిశగా ఆలోచన చేయాలని గిరిజన ప్రజానీకం కోరుతున్నది.
పెద్దపల్లి, మే 15 (నమస్తే తెలంగాణ): పెద్దపల్లి, మంథని రేంజ్‌ల్లో ఈ సీజన్లో ఏడు యూనిట్లను కేటాయించారు. కానీ, మూడు యూనిట్లు మాత్రమే విక్రయించడంతో 3వేల స్టాండర్డు బ్యాగులను (28లక్షల ఆకులు) సేకరణకు అటవీశాఖ అధికారులు ప్రణాళికలు వేశారు. మంథని ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ముత్తారం యూనిట్ పరిధిలో ధర్యాపూర్, హరిపురం, కేషన్పల్లి, మచ్చుపేట, మైదంబండ, పారుపల్లి, గ్రామాల్లో 900 స్టాండర్డు బ్యాగులు, ఖమ్మంపల్లి యూనిట్ పరిధిలోని చిన్నఓదాల, గోపాల్పూర్, ధర్మారం, జిల్లెల్లపల్లి-ఏ, జిల్లెల్లపల్లి బీ, ఖమ్మంపల్లి, ఏ, బీ, సీతంపల్లి గ్రామాల్లో 1700 స్టాండర్డు బ్యాగులు, కల్వచర్ల యూనిట్ పరిధిలోని రత్నాపూర్, సబ్బితం, వెన్నంపల్లి, గౌరెడ్డిపేట గ్రామాల్లో 200 స్టాండర్డ్ బ్యాగులు లక్ష్యంగా మొత్తం 18 కల్లాలను ఏర్పాటు చేశారు. అయితే ఒక్కో స్టాండర్డ్ బ్యాగులో వెయ్యి కట్టలు ఉండనుండగా, ఒక్కో కట్టకు ప్రభుత్వం 3 మాత్రమే చెల్లిస్తున్నది. రోజుల తరబడి ఒక బ్యాగు నింపిన ఏజెన్సీ బిడ్డలకు దక్కేది 3వేలు మాత్రమే. ఈ క్రమంలోనే ఆకు సేకరణపై ఏటేటా ఆసక్తి తగ్గిపోతున్నది.
రేటు పెంచాలి
మేం కూలీ నాలీ జేసుకొని బతికేటోళ్లం. ఆకుల సీజన్ అచ్చిందంటే ఏరవోతం. ఇంటికి అచ్చిన సుట్టాలు అందరం కలిసి ఆకు ఏరుకచ్చి కట్టలుగట్టి అమ్ముతం. కానీ, ఏం లాభం? ఇంత ధర పెరిగితేనే మాకింత పాయిదా. ప్రభుత్వం రేటు పెంచితేనే మాకింత మేతలైది.
– జన్నె రాజేశ్వరి, గోపాల్పూర్ (మంథని మండలం)
ఆకు ధర పెరిగితేనే లాభం
ఆకు ధర పెరిగితేనే మాకు ఆదాయం వస్తది. కానీ, ఏండ్ల నుంచి ఒకే రేటు ఉంటంది. ఏం లాభమైతలేదు. మేం ఏటా ఈ సీజన్ అచ్చిందంటే అడివికి వొయ్యి తునికాకును ఏరుతం. పొద్దుగాల నాలుగు గంటలకు అడివికి పోతే ఇంటికచ్చే సరికి తొమ్మిది, పదైతది. మోపెడన్ని తీసుకొని అత్తం. అన్ని ఒక్కకాడ కుప్పేసుకొని కట్టలు కడుతం. సాయంత్రం కల్లానికి పొయ్యి అమ్ముకత్తం.
– జే ప్రమీల, జిల్లెల్లపల్లి (ముత్తారం మండలం)