కాంగ్రెస్‌లో కల్లోలం మొదలైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరు సంజయ్‌కుమార్ చేరికపై తీవ్ర నిరసన వెల్లువెత్తుతున్నది. నిన్నటి వరకు పార్టీని, ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తూ.. జగిత్యాలలో కార్యకర్తలు, నాయకులను ఇబ్బందులకు గురిచేసిన సంజయ్‌ను ఆదివారం రాత్రి సీఎం రేవంత్‌రెడ్డి తన సమక్షంలో చేర్చుకోవడంతో చిచ్చు రేగింది. పదేళ్లు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తిని, ఎంపీ ఎన్నికల సమయంలో బీజేపీ అభ్యర్థికి మద్దతు పలికి తన ఓటమికి కారణమైన ఆయనను మాటమాత్రం చెప్పకుండా పార్టీలోకి ఎలా తీసుకుంటారంటూ సీనియర్ నాయకుడు,
ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆగ్రహిస్తుండడం పార్టీలో అలజడి రేపుతున్నది. మరోవైపు ఇక తాడోపేడో తేల్చుకుందామంటూ కార్యకర్తలు, నాయకులు స్పష్టం చేస్తుండగా.. వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అయితే, పార్టీలో సీనియర్ నాయకుడు ఉన్న జగిత్యాల కోటాలో మరో ఎమ్మెల్యేను ఎందుకు చేర్చుకోవాల్సి వచ్చిందన్న దానిపై శ్రేణుల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా జీవన్‌రెడ్డిని వదిలించుకునే దిశగా అధిష్టానం అడుగులు వేసిందా..? లేక ఆయన ఉంటే తమ పప్పులు ఉడకవన్న భావనతో ఉమ్మడి జిల్లా నాయకత్వం ఏమైనా కుట్రలకు పూనుకున్నదా..? అందులో భాగంగానే సంజయ్‌ను చేర్చుకున్నారా..? ఇలా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
జగిత్యాల, జూన్ 24, (నమస్తే తెలంగాణ) : జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరు సంజయ్ కుమార్ చేరికపై సీనియర్ నా యకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి హ తాశులయ్యారు. రాజకీయాల్లో సీనియర్ అన్న గౌరవం లేకుండా, కనీసం తనకు మాటమాత్రం చెప్పకుండా తన ప్రత్యర్థిని చేర్చుకోవడంపై తీవ్ర అసంతృప్తి చెందారు. తనను, తన క్యాడర్‌ను అవమానపర్చారంటూ మండిపడుతున్నారు. సోమవారం ఉదయం పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తల ఎదుట తన ఆవేదనను వెల్లగక్కారు.
నాలుగు దశాబ్దాలుగా పార్టీకి సేవలందించానని, ప్రతిపక్ష పార్టీలకు దీటుగా స్పందించి పోరాడానని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు 40 మంది సభ్యుల మండలిలో తానొక్కడినే కాంగ్రె స్ ఎమ్మెల్సీగా పోరాటం చేశానని గుర్తు చేశారు. అయినా, తనకు కనీస మర్యాద ఇవ్వలేదని ఆవేదనకు గురయ్యారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని ఆయన కార్యకర్తలకు స్పష్టం చేయడంతోపాటు మీడియాకు సైతం సమాచారం అందించారు. అలాగే, ఈ విషయా న్ని అధిష్టానంతోపాటు పెద్దల దృష్టికి తీసుకువెళ్లేందుకు సిద్ధమైనట్టు సమాచారం. రాష్ట్ర ఇన్చార్జి దీపాదాస్ మున్షీకి ఫిర్యాదు చేయడంతోపాటు ఇతర కీలక నాయకుల దృష్టికి కూడా తీసుకెళ్లాలని భావిస్తున్నట్టు తెలుస్తున్నది.
సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం రాత్రి సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి ధోరణి ఏమాత్రం సరికాదని, ఆయన స్వలాభం కోసం అవకాశావాద రాజకీయాలు చేస్తున్నాడని, పార్టీ కోసం దశాబ్దాలుగా కష్టపడుతున్న వారికి అన్యాయం చేస్తున్నాడంటూ ధ్వజమెత్తారు. సోమవారం ఉదయమే ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పెద్దసంఖ్యలో తరలివచ్చి ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై ఎప్పుడూ విషం చిమ్ముతూ, వారిపై క్షక్ష సాధించిన ఎమ్మెల్యే సంజయ్‌తో కలిసి ఎలా పనిచేస్తాం? అంటూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
‘మాటమాత్రం చెప్పకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారు సార్? మనం అంటే అంత అలుసా..? అసలు రేవంత్‌రెడ్డి ఎవరు? పార్టీని నాశనం చేసే హక్కు ఆయనకెవరు ఇచ్చారు?’ అంటూ మండిపడ్డారు. ‘గాంధీ భవన్ వెళ్దాం. అవసరమైతే గాంధీభవనన్పై దాడి చేద్దాం’ అంటూ ఆగ్రహంగా ఊగిపోయారు. రేవంత్‌రెడ్డి వద్దకు వెళ్దామని, అవసరమైతే తాడోపేడో తేల్చుకుందామని విన్నవించారు. మల్లాపూర్ మండలం ముత్యంపేటకు చెందిన రాష్ట్ర కిసాన్ సెల్ కో-ఆర్డినేటర్ వాకిటి సత్యంరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని ప్యాక్స్ ద్వారా సీఎం రేవంత్‌రెడ్డి, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేశ్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు పంపించినట్టు చెప్పారు.
జగిత్యాలలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్లు రంగంలోకి దిగారు. రాజీనామా చేసేందుకు సిద్ధమైన జీవన్‌రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఫోన్ చేసి, తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని, ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా జీవన్‌రెడ్డి ససేమిరా అన్నట్టు తెలిసింది.
ఇటు అధిష్టానం ఆదేశాలతో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వేమువాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హుటాహుటిన జగిత్యాలకు చేరుకొని, జీవన్‌రెడ్డి ఇంట్లో భేటీ అయ్యారు. అయితే ప్రభుత్వ తీరు, పార్టీ వ్యవహారంపై సీఎం రేవంత్‌రెడ్డి నిర్లక్ష్యపూరిత, అవకాశవాద రాజకీయాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. నలభై ఏండ్లుగా పార్టీని నమ్ముకొని, కార్యకర్తలను కాపాడుకుంటూ పనిచేస్తే బిహేవ్ చేసేది ఇలాగేనా..? అని ప్రశ్నించినట్టు సమాచారం.
ఈ భేటీ సందర్భంలో సీనియర్ నాయకులు, కార్యకర్తలు, జీవన్‌రెడ్డి కుటుంబ సభ్యులు సైతం పార్టీ విధానాలపై, రేవంత్‌రెడ్డి వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఆది శ్రీనివాస్, లక్ష్మణ్‌కుమార్ నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా, జీవన్‌రెడ్డి మాత్రం మెట్టు దిగిరాలేదని, రాజీనామా లేఖను సైతం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే సమస్య తీవ్రంగా ఉందని, జీవన్‌రెడ్డిని తాము హ్యాండిల్ చేయలేకపోతున్నామని, కార్యకర్తలు, నాయకులు ఆగ్రహంగా ఉన్నారని, అవసరమైతే దాడి చేసే పరిస్థితి ఉందన్న అభిప్రాయానికి వచ్చి, ఈ విషయాన్ని అధిష్టానంతోపాటు సీనియర్లకు చెప్పడంతో రంగంలోకి మంత్రులు, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ను దింపినట్టు సమాచారం.
సాయంత్రం జీవన్‌రెడ్డి ఇంటికి వచ్చిన మంత్రి శ్రీధర్‌బాబు ఎదుట ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించి 200 కోట్ల నిధులు ఇచ్చి కండువా కప్పడం అవసరమా..? పదేండ్లపాటు మనకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తిని పార్టీలోకి తీసుకుంటారా..? ఇదేనా పద్ధతి? నా సీనియారిటి, సిన్సియార్టీకి ఇచ్చే విలువ ఇదేనా..? కార్యకర్తల కష్టాలు, మనోభావాలు అక్కర లేదా..?’ అంటూ తీవ్రంగా ప్రశ్నించినట్టు సమాచారం.
ఈ క్రమం లో మంత్రి శ్రీధర్‌బాబు రెండు సార్లు సీఎం రేవంత్‌రెడ్డితో ‘ఫోన్లో మాట్లాడండి’ అంటూ కోరినా, జీవన్‌రెడ్డి మాత్రం తాను మాట్లాడనని తిరస్కరించినట్టు తెలిసింది. మంత్రి శ్రీధర్‌బాబు వెళ్లిన తర్వాత కూడా ‘రాజీనామాకే కట్టుబడి ఉన్నాను’ అని సన్నిహితులతో చెప్పినట్టు సమచారం. మంగళవారం హైదరాబాద్ వెళ్లి సీనియర్లతో, అధిష్టానంతో మాట్లాడేందుకు జీవన్‌రెడ్డి సిద్ధమైనట్టు తెలుస్తున్నది. పరిస్థితులు ఎలా ఉ న్నా.. అధికారం ఉన్నా, లేకపోయినా కార్యకర్తలు తన వెంట ఉన్నారని, వారి మనోభావాలకు అ నుగుణంగా తన భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని జీవన్‌రెడ్డి విలేకరులతో స్పష్టం చేశారు.
జీవన్‌రెడ్డి నిరాశలో కూరుకుపోయిన విషయా న్ని గుర్తించిన బీజేపీ, ఆయనను పార్టీలోకి ఆహ్వానించేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరడం, కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు, జీవన్‌రెడ్డి అందరూ దీన్ని వ్యతిరేకించడంతో పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తున్నది. అందులో భాగంగానే జీవన్‌రెడ్డికి మొదటి నుంచి ఆప్తుడిగా పేరున్న ఈటల రాజేందర్, కేం ద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌ను రంగంలో కి దింపి జీవన్‌రెడ్డిని కలిసి ఒప్పించాలని సూచించినట్టు సమాచారం. దీంతో వారు రంగంలోకి దిగి జీవన్‌రెడ్డికి టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తున్నది.