Gutka mafia | కోల్ సిటీ, జూలై 20: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గుట్కా మాఫియా పెట్రేగిపోతుందనీ, యువత జీవితాలను చిత్తు చేస్తున్న ఈ నిషేధిత పొగాకు ఉత్పత్తుల వ్యాపారం గోదావరిఖనిలో రాజ్యమేలుతుందనీ, ప్రతి కిరాణం దుకాణంలో లభించడం గమనిస్తే ప్రతి నెల అధికారులకు కమిషన్లు అందుతున్నాయనేది వాస్తవమని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి మార్కపురి సూర్య ఆరోపించారు. వీటిపై ప్రత్యక్ష దాడులకు ఏఐవైఎఫ్ సిద్ధమవుతుందని హెచ్చరించారు. స్థానిక భాస్కర్ రావు భవన్ లో ఆదివారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఆహార భద్రత చట్టం 2006 సెక్షన్ 30 ప్రకారం గుట్కాలను నిషేధించిందనీ, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొంతమంది డీలర్లు ప్రభుత్వంకు టాక్స్ చెల్లించామని హైకోర్టు నుంచి స్ట్ తీసుకవచ్చి రామగుండం కేంద్రంగా రూ.కోట్ల పెట్టుబడులతో గుట్కాల విక్రయాలకు తలుపులు తెరిచారన్నారు. ఇక్కడి నుంచే అన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. ఈ దందాలో డ్రగ్ ఇన్స్పెక్టర్లు, పోలీస్ డిపార్ట్మెంట్ తోపాటు దళారులకు ప్రతి నెల మామూళ్లు అందుతున్నాయని పేర్కొన్నారు. వివిధ సందర్భాలలో అధికారులే యువతకు దిశా నిర్దేశం చేస్తూ గుట్కాలకు బానిస కావొద్దనీ, నిషేధిత పొగాకు ఉత్పత్తులను అరికడుతామని ప్రసంగాలు ఇస్తూ మళ్లీ వారే గుట్కా విక్రయాలను ప్రోత్సహించడం దురదృష్టకరమన్నారు.
ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు అక్రమ మార్గంలో అమ్ముతూ రూ. కోట్లకు పడగలెత్తుతున్నారని పేర్కొన్నారు. గోదావరిఖనికి చెందిన ఒక డీలర్ పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలోని అన్ని దుకాణాలకు సరఫరా చేస్తుంటాడన్నారు. స్థానికంగా ఓ గోదాముల్లో నిల్వ ఉంచి రహస్యంగా దుకాణాలకు తరలిస్తారని పేర్కొన్నారు. ఇప్పటికైనా రామగుండం సీపీ ప్రత్యేక దృష్టి సారించి డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నగర కార్యదర్శి ఆసాల నవీన్, రాణవేణి సుధీర్ కుమార్, పోతరాజు నాగరాజు, బొడ్డుపల్లి నరేష్ తదితరులు పాల్గొన్నారు.