తిమ్మాపూర్, మే25 : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీ శివారులోని లోయర్ మానేరు జలాశయం పరిధిలో ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన శ్రీనిద్ మృతిపై అనుమానాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేస్తూ అలగనూరు చౌరస్తాలో ఆయన బంధువులు, స్నేహితులు సోమవారం ఉదయం ధర్నా చేశారు. శ్రీనిద్ మృతదేహం అనుమానస్పద స్థితిలో చేతులకు తాళ్లు కట్టి, మెడకు ఉరివేసినట్టుగా చెట్టుకు వేలాడుతూ కనిపించడం పట్ల కుటుంబ సభ్యులు బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కచ్చితంగా హత్యనే ఆని.. లోతైన దర్యాప్తు చేసి నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. ధర్నా చేయడంతో వరంగల్-హైదరాబాద్ రోడ్డులో భారీ స్థాయిల వాహనాలు నిలిచిపోగా ఎల్ఎండీ, కరీంనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నామని, హత్య అయితే నిందితులను కచ్చితంగా పట్టుకొని శిక్షిస్తామని బంధువులకు పోలీసులు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.