పెగడపల్లి, డిసెంబర్ 18: ధరణి పోర్టల్ మళ్లీ రాష్ట్ర వ్యాప్తంగా నిలిచింది. బుధవారం భూముల రిజిస్ర్టేషన్, స్లాట్ బుకింగ్ల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ప్రభుత్వం ధరణి పోర్టల్ సవరణలో భాగంగా డిసెంబర్ 12 సాయంత్రం 5గంటల నుంచి 16వ తేదీ ఉదయం వరకు డాటా బేస్ అప్గ్రేడ్ ప్రక్రియను చేపట్టింది. తిరిగి ఈ నెల 16 నుంచి ధరణి సేవలు యథావిధిగా ప్రారంభం కాగా, ఈ నెల 16న ధరణి పోర్టల్లో రిజిస్ర్టేషన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1785 మంది రైతులు స్లాట్స్ బుక్ చేసుకున్నారు.
అందులో 1402 మంది భూములను రిజిస్ర్టేషన్ చేసుకున్నారు. అలాగే 17న మంగళవారం 1917 మంది ధరణి పోర్టల్లో భూముల రిజిస్ర్టేషన్ల కోసం స్లాట్స్ బుక్ చేసుకోగా, బుధవారం కేవలం 1141 మంది భూములు రిజిస్ర్టేషన్ చేసకున్నారు.
బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచే ధరణి పోర్టల్ పని చేయక పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక వ్యవసాయ భూముల రిజిస్ర్టేషన్లు నిలిచి పోయాయి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఇబ్బంది పడ్డారు. దీనికి తోడు ధరణిలో భూముల రిజిస్ర్టేషన్ కోసం స్లాట్ బుకింగ్ కోసం రైతులు మీ సేవ కేంద్రాలు, డాక్యుమెంట్ రైటర్ల దగ్గరికి వెళ్లగా.. ధరణి సైట్ పని చేయడం లేదని నిర్వాహకులు చెబుతుండడంతో చేసేదేం లేక నిరాశతో వెనుదిరిగారు.