మల్యాల, మే 31: కొండగట్టు అంజన్న సన్నిధికి భక్తజనం పోటెత్తింది. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన అంజన్న దీక్షాపరులు, భక్తులతో కాషాయ శోభను సంతరించుకున్నది. హనుమాన్ పెద్దజయంత్యుత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారి మూలవిరాట్టుకు అర్చకులు ప్రత్యేకాభిషేకం చేశారు.
వేంకటేశ్వరస్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు పూజలు నిర్వహించారు. శాస్ర్తోక్తంగా త్రికుండాత్మక యజ్ఞం చేశారు. ఆంజనేయుడి సన్నిధిలో దీక్షాపరులు మాల విరమణ చేశారు. ఇరుముడులు సమర్పించారు. తలనీలాలు ఇచ్చిన తర్వాత క్యూలైన్ల గుండా వెళ్లి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.