కార్పొరేషన్, మే 17: రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు కులవృత్తులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే.. సీఎం కేసీఆర్ మాత్రం ప్రోత్సహించేందుకు అనేక పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. కరీంనగర్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ప్రతి డివిజన్‌లోనూ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. నగరంలో మౌళిక సదుపాయాలను మెరుగుపర్చడంతోపాటు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. నగరంలో 40 లక్షల నిధులతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు బుధవారం మంత్రి భూమిపూజ చేశారు. ముందుగా 15వ డివిజన్లో పలు అభివృద్ధి పనులు, డివిజన్లో 24 గంటల మంచినీటి సరఫరా నల్లాను ప్రారంభించారు.
అనంతరం రజక సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. అలాగే ప్రతి కులానికి రాష్ట్ర రాజధానిలో ఆత్మగౌరవ భవనాలు ఉండాలన్న లక్ష్యంతోనే స్థలాలను కేటాయించి భవన నిర్మాణాలకు నిధులు విడుదల చేశారని, ఇప్పటికే పలు భవనాల నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయన్నారు. నగరంలో చేపడుతున్న కేబుల్ బ్రిడ్జి మానేరు రివర్ ఫ్రంట్ పనులు పూర్తయితే నగరం దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారుతుందన్నారు. నగరంలోని ప్రధాన రహదారులను మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు త్వరలోనే మరో కోటింగ్ పనులు చేపట్టనున్నామన్నారు. ప్రతి డివిజన్లోని సమస్యలను పరిష్కరించి అద్భుతమైన నగరంగా మారుస్తామన్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరంగా కరీంనగర్ మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు, కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్, గుగ్గిళ్ల జయశ్రీ, గంట కళ్యాణి శ్రీనివాస్, రజక సంఘం నాయకులు పూసల సంపత్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.