ఒకప్పుడు ఆయన ఓ సాదాసీదా వ్యాపారి.. కానీ, ఇప్పుడు రైస్‌మిల్లు ఇండస్ట్రినే శాసించే స్థాయికి ఎదిగిన మిల్లర్.. జగిత్యాల జిల్లాలో ఆయన చెప్పిందే వేదం.. కారణం ఆయనది న్యాయబద్ధమైన వ్యాపారం కాదు, అంతా అక్రమమే.. అధికారుల అండదండలతో
అనతికాలంలోనే ఎదిగిన ఆయన, ఏళ్ల తరబడిగా ‘రేషన్ దందా’ నడుపుతూ కోట్లు కూడా బెట్టాడు. వచ్చిన సొమ్ముతో మిల్లుల సంఖ్య పెంచుతూ పోయాడు. లంచాల కింద అధికారులకు బంగారు బిస్కెట్లను ఎరవేసి, దందాను ‘మూడు పువ్వులు ఆరుకాయలు’గా నడుపుతున్నాడు.
దాంతో సంబంధిత అధికారులంతా అక్రమాలకు అడ్డుకట్టవేయకుండ ‘జీ హుజూర్’ అనడమే కాదు, వంద కోట్ల విలువైన సీఎంఆర్ ఇవ్వకుండా ఎగనామం పెట్టినా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. అంతటితో ఆగకుండా సదరువ్యాపారికే అందరికన్నా ముందుగా ధాన్యం అలాట్ చేస్తున్నారు. ఆయన అక్రమాలు శృతిమించి అసోసియేషన్ సభ్యత్వం ఇవ్వడానికి నిరాకరించినా.. అధికారులు మాత్రం అతన్ని పల్లకీలో మోస్తున్నారన్న విమర్శలు మూటగట్టుకుంటున్నారు. కొంత మంది అధికారులు బంగారు బిస్కెట్లకు ఎలా లాలుచి పడుతున్నారో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చని పలువురు రైస్‌మిల్లర్లు చెబుతున్నారు.
కరీంనగర్, జూలై 26 (నమస్తే తెలంగాణప్రతినిధి) : ఆయన ఒకప్పుడు ఓ సాదాసీదా వ్యాపారి. ఓ మోస్తారు నుంచి వ్యాపారం ప్రారంభించి, ముందుగా ఓ మిల్లుకు యజమానిగా మారి, అక్కడి నుంచి రేషన్ దందా మొదలు పెట్టాడు. ఆ దందాను యథేచ్ఛగా నడుపుతూ.. ‘ఇంతితై వటుడింతై’ అన్నట్టు ప్రస్తుతం ఆయన మూడు నాలుగు మిల్లులకు యజమానిగా మారాడు. ఇదే జిల్లాలో ఆయన కంటే ముందుగా వ్యాపారం ప్రారంభించిన అనేక మిల్లుల యజమానులు, ఉన్న ఆ ఒక్కటి నడపలేక ఇబ్బందులు పడుతుంటే ఆయన మాత్రం అనతి కాలంలో పెద్ద మొత్తంలో కొత్త మిల్లులు ఏర్పాటు చేశాడు.
ఇంత స్వల్పకాలంలో ఎదుగుదలకు కారణం అంతా అక్రమ వ్యాపారమే! మొన్నటివరకు రేషన్ దొడ్డు బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి.. వందల కోట్లు సొమ్ము కూడా పెట్టిన సదరు వ్యాపారి, ప్రస్తుతం సన్నబియ్యాన్నీ సైతం వదలడం లేదు. రేషన్ దందాలో ఉన్న లాభం ఎందులో లేదని భావించిన ఆయన, ఈ దందానుంచి బయటకు రావడం లేదు. అందుకు జిల్లాలోని కొంత మంది అధికారులు పరిపూర్ణంగా సహకరిస్తున్నారు. అంతేకాదు, సివిల్ సప్లయ్ విభాగంలో ఉన్న లొసుగులు, అధికారిక వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఆయన దగ్గరి బంధువు ఒకరిని ఆ శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో పెట్టించినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఆయన ద్వారా సమస్త వివరాలుసైతం తీసుకుంటున్నట్టు తెలుస్తున్నది.
డిఫాల్ట్ అయింది వంద కోట్లకుపైనే?
సీఎంఆర్‌కు సంబంధించి 10 కోట్ల డిఫాల్ట్ ఉంటే ముక్కు పిండి కేసులు నమోదు చేస్తున్న అధికారులు, సదరు వ్యాపారి విషయంలో మాత్రం అన్ని మినహాయింపులు ఇస్తున్నారు. దాదాపు 100 కోట్లకు పైగా డిఫాల్ట్లో ఉన్నా చోద్యం చూస్తున్నారు. ఆయన వివిధ పేర్లతో నడుపుతున్న ఓ మిల్లులో యాసంగి, వానకాలం కలిపి 20వేలకుపైగా మెట్రిక్ టన్నులు, రెండో మిల్లు నుంచి 20,200పై చిలుకు మెట్రిక్ టన్నులు, మూడో మిల్లులో 11వేల మెట్రిక్ టన్నులు, నాలుగో మిల్లు నుంచి దాదాపు 4,600 పైచిలుకు మెట్రిక్ టన్నులు అంటే.. మొత్తంగా చూస్తే దాదాపు 56వేల పైచిలుకు మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించిన బియ్యం ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉందని తెలుస్తున్నది.
వీటి విలువ సుమారు వంద కోట్లకుపైగా ఉంటుందని అధికారవర్గాలే పేర్కొంటున్నాయి. నిబంధనల ప్రకారం డిఫాల్ట్ అయిన మిల్లులకు ధాన్యం కేటాయించరాదు. ఏదేని కారణాల వల్ల చేయాల్సి వస్తే అందుకు సివిల్ సప్లయ్ కమిషనర్ అనుమతి తప్పనసరిగా ఉండాలి. కానీ, స్థానిక అధికారులు మాత్రం ఇవేవి పట్టించుకోకుండా వేలాది మెట్రిక్ టన్నుల ధాన్యం సదరు మిల్లులకు తాజాగా పంపించారని మిల్లర్లే చెబుతున్నారు. అంటే అధికారయంత్రాంగం సదరు వ్యాపారి ఇచ్చే బంగారు బిస్కెట్లకు కక్కుర్తి పడి అక్రమార్కులకు ఎలా సహకరిస్తుందో.. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.
అంతేకాదు, ధాన్యం కేటాయింపులు చేయాలంటే మిల్లర్ల నుంచి బ్యాంకు గ్యారెంటీలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇదే జిల్లాలో చిన్న వ్యాపారులనుంచి దండిగా గ్యారెంటీలు తీసుకున్న అధికారులు, ఈ వ్యాపారికి మాత్రం ఇక్కడ కూడా ప్రత్యేక మినహాయింపు ఇచ్చి నామమాత్రంగా గ్యారెంటీలు తీసుకున్నట్ట్టు తెలుస్తున్నది. ఎందుకంటే ఎవరైనా పై వారు అడిగితే చెప్పుకునే విధంగా ఉండాలన్న ఉద్దేశంతో స్థానిక అధికారులు కొంత మంది ఈ వ్యవహారానికి ఒడిగట్టినట్టు తెలుస్తున్నది. బ్యాంకు గ్యారెంటీలు ఇతరుల వద్ద వసూలు చేసిన తీరు.. ఈ వ్యాపారికి ఇచ్చిన మినహాయింపుల వంటి అంశపై ప్రస్తుతం మిల్లర్లలో జోరుగా చర్చ సాగుతున్నది.
బిస్కెట్లకు కక్కుర్తిపడి!
అక్రమార్కులకు ముచ్చెమచటలు పట్టించాల్సిన అధికారులు, వారి పంచన చేరుతున్నారన్న విమర్శలున్నాయి. జగిత్యాలో జిల్లాలోనూ ఇలానే వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సదరువ్యాపారి ఇచ్చే బంగారు బిస్కెట్లకు ఆశపడి, ప్రభుత్వ ఆదాయానికి వందల కోట్లలో గండి కొడుతున్నా ‘తమకెందుకులే’ అన్నట్టు వ్యవహరిస్తున్న తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనకు సహకరించే వారిలో ఇద్దరు ఉన్నతాధికారులు కీలకంగా ఉన్నారనే చర్చ ప్రస్తుతం జగిత్యాల రైస్‌మిల్లర్ల వర్గంలో నడుస్తున్నది.
విశేషం ఏమిటంటే.. సదరు వ్యాపారిచేసే అక్రమాలు గుర్తించి అక్కడి సంఘం ఆయనకు సభ్యత్వం ఇవ్వడానికి నిరాకరిస్తే.. అధికారులు మాత్రం ముడుపులకు తలొగ్గి నెత్తిన పెట్టుకొంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. నిజానికి ఈ విషయంలో లోతుగా విచారణ జరిపితే సదరు వ్యాపారికి సంబంధించి లెక్కకు మించిన అక్రమాలు బహిర్గతం అవుతున్నాయన్న చర్చ సాగుతున్నది. అంతేకాదు, ఆయనకు ఎంత మంది అధికారులు వంత పాడుతున్నారో తెలుస్తుందన్న అభిప్రాయాలు వస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం, ఉన్నతాధికారులు లోతైనా విచారణ జరుపుతారా..? లేక చూసీచూడనట్టు వ్యవహరిస్తారా..? అన్నది మున్ముందు తేలుతుంది. ఏదేమైనా అక్రమార్కుల ఆగడాలకు అడ్టుకట్ట వేయకపోతే ఒకరినిచూసి ఒకరు.. మిల్లర్లు తప్పుడు మార్గాల్లోనే ప్రయాణం చేసే ప్రమాదముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే వంద కోట్లకుపైగా విలువచేసే బియ్యం ఇవ్వకుండా డిఫాల్ట్ అయిన సదరు మిల్లులకు ఇతర మిల్లుల కన్నా అధిక ప్రాధాన్యం ఇచ్చి ఎలా కేటాయించాల్సి వచ్చిందో..? అందులో సూత్రదారులు, పాత్రదారులెవ్వరన్నది? బహిర్గతం కానున్నది.