ఓదెల, మార్చి 9: చలి ఇంకా వదలడం లేదు. మార్చి మొదటివారం దాటినా వణుకు తగ్గడం లేదు. పొద్దంత ఎండ దంచుతున్నా.. రాత్రివేళల్లో చలి వణికిస్తున్నది. దీనికి తోడు దట్టమైన మంచుదుప్పటి పరుచుకుంటున్నది. ఆదివారం తెల్లవారుజామున ఉమ్మడి జిల్లాలో అక్కడక్కడ పొగమంచు కమ్మేసింది.
50మీటర్ల దూరంలో ఏదీ కనిపించనంతగా ఆవహించడంతో ‘వామ్మో ఇదేం మంచు?’ అంటూ ప్రజలు భయపడిపోయారు. రోడ్లపై వెళ్లే వాహనదారులు హెడ్ లైట్లు వేసుకొని నెమ్మదిగా వెళ్లారు. రైలు నడిపే లోకో పైలెట్లు సైతం సిగ్నల్స్ కనిపించక తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. వేగాన్ని తగ్గించి నడిపించారు. వాతావరణంలో వచ్చిన మార్పులే ఇందుకు కారణమని పలువురు పేర్కొంటున్నారు.