కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే కాదు, ఉమ్మడి రాష్ట్రంలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్‌గా మనుగడను కొనసాగించిన జగిత్యాల తహసీల్ ఆఫీస్ భవనం కాలగర్భంలోకి కలిసిపోతున్నది. దాదాపు 90 ఏండ్ల క్రితం నిజాం పాలనలో నిర్మితమై, దశాబ్దాలపాటు బాసిల్లిన ఈ భవనం.. నేలమట్టం కాబోతున్నది. ఇప్పటికే కూల్చివేత మొదలు కాగా, తాజాగా దాని ఆవరణలోనే ఉన్న టీఎన్జీవో, ట్రెస్సా, ఫోర్త్‌క్లాస్ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఉద్యోగ సంఘం, ప్రెస్‌క్లబ్ భవనాలకు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. అయితే ఈ స్థలంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తారని, కోట్లాది రూపాయల విలువైన స్థలం ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతారనే ప్రచారం జరుగుతున్నది.
జగిత్యాల, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : జగిత్యాల పట్టణ నడిబొడ్డున సువిశాలమైన స్థలంలో ఉన్న పురాతన తహసీల్ ఆఫీస్‌కు ఎంతో చరిత్ర ఉన్నది. దాదాపు 90 ఏండ్ల క్రితం ఏడో నిజాం చక్రవర్తి అయిన మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో నిర్మితమైంది. మొదట ఇది దువ్వమ్ తాలూక్దారు (ఆర్డీవో) భవనంగా ఉన్నా.. ఆ తర్వాత తహసీల్ ఆఫీస్‌గా మారింది. పక్కనే నిర్మించిన భవనంలోకి ఆర్డీవో ఆఫీస్ వెళ్లిపోయింది. 105 సర్వే నంబర్లోని నాలుగైదు ఎకరాల స్థలం పురాతన తహసీల్ ఆఫీస్ ఆధీనంలో ఉండగా.. దీనిని ఆనుకొనే ఆర్డీవో, అర్బన్ తహసీల్, రూరల్ తహసీల్ ఆఫీస్‌లు ఉన్నాయి. అలాగే వ్యవసాయ శాఖకు సంబంధించి రెండు భవనాలు ఉన్నాయి. నిజాం కాలంలో నిర్మించిన తహసీల్ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో కొన్నాళ్లుగా దీనిని వినియోగించడం లేదు. అయితే ఈ కార్యాలయంలోని రెండు గదులను మాత్రం మీసేవతోపాటు రెవెన్యూ అనుబంధ కార్యక్రమాల కోసం వినియోగిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం వానకాలం కావడంతో అది కూలిపోయే ప్రమాదముంటుందని జిల్లా రెవెన్యూ అధికారులు కూల్చివేత పనులు మొదలు పెట్టారు. అయితే ఈ భవనం కూల్చివేత తర్వాత ఐదు గుంటల స్థలంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఒక రాజకీయ పార్టీ నాయకులు మీడియా సాక్షిగా.. కొందరు పెట్రోల్ బంక్ ఏర్పాటుకు యత్నిస్తున్నారని, కోట్ల రూపాయల విలువైన ఆ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు యత్నిస్తున్నారని చెప్పడం చర్చనీయాంశమైంది. అయితే ఈ విషయంలో రెవెన్యూ అధికారులు మాత్రం పెట్రోల్ బంక్ ఏర్పాటు విషయం తమకు తెలియదని, భవనం శిథిలావస్థకు చేరడంతో కూలిపోతే ప్రమాదం ఉంటుందనే కూల్చివేస్తున్నామని చెబుతున్నారు. కాగా, రెవెన్యూ వర్గాల ద్వారా అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం.. విలువైన స్థలంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్‌బంక్ ఏర్పాటు చేయించే ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. అలాగే రెవెన్యూ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తే రెవెన్యూ ఉద్యోగులకు మేలు జరుగుతుందని, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతున్నది.
సర్వే నంబర్ 105లోని సర్కారు భూమిలో గతంలోనే అసోసియేషన్ భవనాల నిర్మాణం కోసం స్థలం ఇచ్చారు. దాదాపు యాభై ఏళ్ల క్రితం టీఎన్జీవోలకు, ఆ తర్వాత తెలంగాణ రెవెన్యూ అసోసియేషన్‌తోపాటు నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం, పెన్షనర్ల సంఘాలకు స్థలాలు ఇచ్చారు. కేటాయించిన స్థలాల్లో దశాబ్దాల క్రితమే ఆయా సంఘాల భవనాలను నిర్మించుకొని, కార్యక్రమాలను నిర్వహించుకుంటూ వస్తున్నారు. పాత తహసీల్ ఆఫీస్ ఎదురుగానే జగిత్యాల పట్టణ ప్రెస్‌క్లబ్‌కు సైతం స్థలం ఇవ్వడంతో ప్రెస్‌క్లబ్ సభ్యులు భవనాన్ని నిర్మించుకున్నారు. కాగా, వివిధ సంఘాలకు సంబంధించిన భవనాలన్నింటికీ జగిత్యాల అర్బన్ తహసీల్దార్ బుధవారం నోటీసులు జారీ చేశారు. 105 సర్వే నంబర్లో నిర్మించుకున్న భవనాలకు సంబంధించి ప్రభుత్వం గతంలో ఇచ్చిన అనుమతులు, ప్రొసీడింగ్స్ కాపీలను రెండు రోజుల వ్యవధిలో సబ్మిట్ చేయాలని ఆదేశించారు. కొన్ని సంఘాలకు చెందిన వారు నోటీసులు తీసుకోకపోవడంతో గోడలకు నోటీసులు అంటించారు. కాగా, ఈ విషయమై జగిత్యాల ఆర్డీవోను సంప్రదించగా, ఉన్నతాధికారుల ఆదేశాల మే రకు సంఘాల భవనాలకు నోటీసులు ఇచ్చామన్నారు.
పురాతన తహసీల్ ఆఫీస్ ఆవరణలో మూడు నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించుకున్న ప్రభుత్వోద్యోగ సంఘాల భవనాలకు నోటీసులు ఇవ్వడం వెనక ఏదో మతలబు ఉందన్న సందేహాలు తలెత్తుతున్నాయి. తహసీల్ ఆఫీస్ భవనం కూల్చివేత తర్వాత కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇన్ని రోజులు రెవెన్యూ అధికారులు అలాంటిది ఏమి లేదని చెబుతూ వచ్చినా, బుధవారం నోటీసులు ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, పాత్రికేయులు, రాజకీయ నాయకుల్లో నోటీసులపైనే చర్చ జరుగుతున్నది. పెట్రోల్ బంక్ నిర్మాణ యోచన లేదని చెబుతున్న అధికారులు ఏళ్లుగా ఉంటున్న సంఘ భవనాలకు నోటీసులు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తహసీల్ భవనం కూల్చివేత వెనకాల ఏదో జరుగుతున్నదని అనుమానిస్తున్నారు. చారిత్రక భవనానికి మరమ్మతులు చేస్తే జగిత్యాల జిల్లాకే తలమానికంగా ఉండేదని పట్టణవాసులు అభిప్రాయపడుతున్నారు.