ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 23 : తమ తండాలో ఒకే టీచర్‌తో ఇబ్బందులు పడుతున్నామని, మరో టీచర్‌తోపాటు అంగన్వాడీ టీచర్ కావాలని ఎల్లారెడ్డిపేట మండలం కిష్టూనాయక్తండా వాసులు శనివారం బడికి తాళం వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో తమ తండాలో అంగన్వాడీ కేంద్రం ఉండేదని, దీంతో పాటు పాఠశాలలో ఇద్దరు టీచర్లు విధులు నిర్వహించారని తెలిపారు. ఇటీవల వర్క్ అడ్జస్ట్మెంట్లో భాగంగా ఇద్దరు టీచర్లలోంచి ఒకరిని బదిలీ చేశారని తెలిపారు.
అంగన్వాడీ కేంద్రాన్ని తండా నుంచి సుమారు కిలో మీటర్ దూరంలో ఉన్న రాజన్నపేటకు మార్చడంతో తమ పిల్లలను అంత దూరం పంపించలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. దీంతో చేసేదేమి లేక కిష్టూనాయక్ తండా ప్రాథమిక పాఠశాలకే పంపిస్తున్నామని, అయితే, రెండు గదులను చూడడం ఒక టీచర్‌తో కావడం లేదని, చిన్నారులను నియంత్రించేందుకే రోజంతా గడిచిపోతున్నదని తెలిపారు.
దీంతో చదువు కుంటుపడిపోతున్నదని కలెక్టర్‌కు కూడా వినతి ప త్రం అందించినట్లు తెలిపారు. అయినప్పటికీ తమ తండాలోని పాఠశాలను పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో శనివారం మరో టీచర్‌తోపాటు, అంగన్వాడీ టీచర్‌ను కేటాయించే వరకు స్కూల్ బంద్ చేయాలని పాఠశాల గేటుకు తాళం వేసి నిరసన తెలిపారు. దీంతో పాఠశాల ఉపాధ్యాయురాలు సౌమ్య, కార్యదర్శి మౌనిక సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పడంతో స్కూల్ గేటు తాళం తీశారు.
మా పిల్లలు ఎక్కువ మంది ఉన్నరు
ఇంతకు ముందు మా బడిలో ఇద్దరు టీచర్లు ఉండెటోళ్లు. అంగన్వాడీ స్కూల్ కూడా ఉండేది. ఇప్పుడు ఇద్దరు టీచర్ల నుంచి ఒకరిని ట్రాన్స్ఫర్ చేసిన్రు. అంగన్వాడీ స్కూల్ కూడా ఇక్కడ నుంచి పోయింది. మరి పిల్లల పరిస్థితి ఏంది. కలెక్టర్ ఆఫీసుల దరఖాస్తు కూడా ఇచ్చొచ్చినం. కానీ, సార్లు ఎవరూ పట్టించుకుంటలేరు. పిల్లలు లేక ఇన్ని రోజులు తండ్లాడినం. ఇప్పుడు పిల్లలున్నా సార్లు లేరు. మా బడికి ఒక టీచర్‌ను పంపాలె. అంగన్వాడీ టీచర్ కూడా ఇక్కడికి రావాలె.
-హన్మంత్‌నాయక్, కిష్టూనాయక్తండా, ఎల్లారెడ్డిపేట మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా