Dalit Bandhu | చందుర్తి : మొన్నటి వరకు వారిద్దరూ బస్సు డ్రైవర్లు.. కానీ, ప్రస్తుతం దళితబంధుతో అదే బస్సుకు ఓనర్లయ్యారు. సీఎం కేసీఆర్ తీసుకు వచ్చిన ఈ పథకం వారి జీవితాల్లో వెలుగులు నింపింది. గతంలో నెలకు కేవలం రూ.15 వేల వేతనంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చిన వారు ఇప్పుడు చెరో రూ.60 వేల వరకు సంపాదిస్తూ ఆర్థికంగా బలపడుతున్నారు.
చందుర్తి మండలకేంద్రానికి చెందిన రాగుల సాగర్, నేరెళ్ల శేఖర్ మొన్నటి వరకు ఆర్టీసీ బస్సు డ్రైవర్లుగా పనిచేసేవారు. వీరికి నెలకు రూ.15 వేల వేతనం రాగా, వాటితోనే తమ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగించేవారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన దళితబంధుతో ఒక్కసారిగా వారి కుటుంబాల్లో వెలుగులు వచ్చాయి. ఈ పథకం ద్వారా వీరికి ఒకొక్కరికి రూ.10 లక్షలు ఇవ్వడంతో బస్సును కొనుగోలు చేసి ఆర్టీసీతో ఒప్పందం చేసుకున్నారు. దీంతో నిన్నటి వరకు డ్రైవర్లుగా ఉన్న వీరు బస్సుకు ఓనర్లుగా మారారు. అంతే కాకుండా, బస్సు ద్వారా వీరికి నెలకు రూ.1.20 లక్షల నుంచి రూ.1.30 వరకు ఆదాయం వస్తుండడంతో ఆర్థికంగా బలపడుతున్నారు.
నిన్నటి వరకు డ్రైవర్లుగా పనిచేసిన మేము దళితబంధు పథకంతో బస్సు ఓనర్లుగా మారడం చాలా సంతోషంగా ఉంది. నేను కొన్నేండ్లు మా ఊళ్లో ఆటో , ట్రాక్టర్, డ్రైవర్‌గా పనిచేశా. తర్వాత ఏడేండ్లు డీసీఎం వ్యాను నడిపా. ఆ తర్వాత మూడేండ్ల నుంచి ఆర్టీసీ బస్సు నడుపుతున్నా. చాలీ చాలని జీతంతో కుటుంబ పోషణ చాలా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు ఆ బాధ లేదు.
– నేరెళ్ల శేఖర్, చందుర్తి, లబ్ధిదారుడు
దళితబంధు పథకం తెచ్చిన సీఎం కేసీఆర్ దళితుల పాలిట దేవుడిలా మారాడు. ఈ పథకంలో మేం ఎంపిక కాగా, ఇద్దరం కలిసి బస్సు కొనాలనుకున్నాం. రూ.20 లక్షలు దళితబంధు పైసలకు తోడు రూ.20 లక్షలు బ్యాంకులో లోను తీసుకొని రూ.41.5 లక్షలతో కొనుగోలు చేశాం. వెంటనే ఆర్టీసీలో నమోదు చేసుకోగా సిరిసిల్ల- వరంగల్ రూటులో అవకాశం వచ్చింది. సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వానికి మా కుటుంబాలు జీవితాంతం రుణపడి ఉంటయ్.
– రాగుల సాగర్, చందుర్తి, లబ్ధిదారుడు
దళితబంధు పథకం లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా జరిగింది. అర్హులైన నిరుపేద దళితులను గుర్తించి రూ.10 లక్షలు వారి ఖాతాలో జమచేయించాం. దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతది. దళితబంధు దేశానికే ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నది.
– వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు