చారిత్రక దళితబంధు పథకం దిగ్విజయమైంది. దళితుల రాత మార్చి, ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో గతేడాది ఆగస్టు 16న సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ పథకం, పైలెట్ ప్రాజెక్టు హుజూరాబాద్ నియోజకవర్గంలో అనుకున్న లక్ష్యం చేరుకున్నది. 18,021 యూనిట్లు పూర్తిస్థాయిలో విజయవంతంగా అమలైన సందర్భంగా సోమవారం రాత్రి కరీంనగర్‌లోని డీర్ పార్క్‌లో అధికారులతో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ముఖ్య అతిథిగా హాజరుకాగా, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. దళితబంధు దేశ చరిత్రలోనే నూతన ఒరవడిని సృష్టించిందని, దళితులు ఉన్నత స్థాయికి ఎదిగేలా చేసిందని కొనియాడారు. పథకం విజయవంతానికి ప్రతి అధికారి కష్టపడ్డారని ప్రశంసించారు.
కరీంనగర్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళితబంధును తీసుకొచ్చారు. హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన గతేడాది ఆగస్టు 15న శాలపల్లి-ఇందిరానగర్ వేదికగా పథకానికి అంకురార్పణ చేశారు. అప్పటి నుంచి అధికారులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ యూనిట్ల ఎంపికపై లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. ఆర్థికంగా వృద్ధి సాధించేలా యూనిట్ ఎంపిక చేసుకోవాలని సూచించారు. అవసరమైన వారికి ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇప్పించారు. వెనువెంటే గ్రౌండింగ్ చేశారు.
మొదట అనుకున్న లక్ష్యం మేరకు 18,021 యూనిట్లు పూర్తి స్థాయిలో విజయవంతంగా అమలు చేసిన నేపథ్యంలో సోమవారం రాత్రి కరీంనగర్ శివారులోని డీర్ పార్కులో హుజూరాబాద్ నియోజకవర్గ క్లస్టర్ అధికారులతో సక్సెస్ మీట్ నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ హాజరై, దళితబంధుపై అభిప్రాయాలను పంచుకున్నారు. అధికారులు కష్టపడిన తీరును వివరించడంతోపాటు ప్రశంసించారు. క్లస్టర్ అధికారులు పథకం అమలులో తమ అనుభవాలను తెలిపారు. ఈ సందర్భంగా అధికారులతోపాటు బ్యాంకర్లకు జ్ఞాపికలు అందజేయగా, కలెక్టర్‌ను బండ శ్రీనివాస్ సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, శ్యాంప్రసాద్ లాల్, సీపీ వీ సత్యనారాయణ, జడ్పీ సీఈవో ప్రియాంక, ట్రైనీ కలెక్టర్ లెనిన్ వాట్సల్ టోపో, హుజూరాబాద్ ఆర్డీవో హరిసింగ్ తదితరులు పాల్గొన్నారు.
దేశ చరిత్రలోనే నూతన ఒరవడి
దళితబంధు దేశ సామాజిక, ఆర్థిక రంగాల్లో నూతన ఒరవడిని సృష్టించింది. నా 13 ఏళ్ల ఉద్యోగ జీవనంలో మరోసారి చూడని ఏకైక పథకం. ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. దీనిని హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయడం కోసమే నన్ను ఇక్కడికి కలెక్టర్‌గా పంపించారు. ఈ స్కీం అమలు కోసం అధికారులతోపాటు బ్యాంకర్లు నిరంతరం శ్రమించారు. క్షేతస్థాయిలో తిరుగుతూ విజయవంతం చేశారు.
– ఆర్వీ కర్ణన్, కరీంనగర్ కలెక్టర్
18,021 మంది లబ్ధిదారులకు వర్తింపజేశాం
దళితజాతి అబివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తెచ్చిన పథకం దళితబంధు. 18021 మంది లబ్ధిదారులకు దళితబంధును వర్తింపజేశాం. ప్రతి యూనిట్ స్వయంగా పరిశీలించాం. నిన్నటి వరకు ఎటువంటి గౌరవం లేని జాతులకు గౌరవం దక్కింది. ఈ పథకం దేశవ్యాప్తంగా అమలు చేయగలిగే ఒకే ఒక్క వ్యక్తి కేసీఆర్.
– బండ శ్రీనివాస్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్