తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీ గ్రామానికి చెందిన యువరైతు కోతి రాజుకు గ్రామ వాట్సాప్ గ్రూప్‌లో ‘పీఎం కిసాన్ యోజన’ పేరిట ఏపీకే ఫైల్ వచ్చింది. ఆ ఫైల్ ఓపెన్ చేశాడు. కొద్దిసేపు ఇన్స్టాల్ అయిన సాఫ్ట్వేర్.. అనంతరం ఓపెన్ అని రెడ్ కలర్లో రావడంతో అనుమానించి, వెనక్కి వచ్చేశాడు. వెంటనే తన అకౌంట్లు చెక్ చేసుకున్నాడు. డబ్బులు కట్ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నాడు. అయితే తాను ‘ఓపెన్’ దగ్గర రెడ్‌మార్క్ అని చూడకుండా ఉంటే తన ఫోన్ హాక్ అయ్యేదని, ఖాతాలోని నగదు పోయేవని వాపోతున్నాడు.
తిమ్మాపూర్/ఎల్లారెడ్డిపేట, జూలై 27 : సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో రకంగా మోసాలకు తెగిస్తున్నారు. ఇప్పుడు ఎవుసాన్ని నమ్ముకొని బతికే రైతులను టార్గెట్ చేశారు. ‘పీఎం కిసాన్ యోజన’ పేరిట ఏపీకే ఫైల్స్, లింక్‌లను గ్రామాల వాట్సాప్ గ్రూపుల్లో పంపుతూ వలలో పడేస్తున్నారు. కేంద్ర సాయం వచ్చిందేమోనని చాలా మంది రైతులు ఆ ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయగానే, వారి ఫోన్లు హాక్ చేస్తున్నారు. బ్యాంకు ఖాతాలోని నగదును లూటీ చేస్తూ నిండా ముంచుతున్నారు.
అయితే రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. పీఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వ సాయం నేరుగా రైతుల ఖాతాల్లోకే వస్తాయని చెబతున్నారు. సోషల్ మీడియాలో వచ్చే ఏ ఫైల్స్, లింక్‌లు, పీడీఎఫ్‌లు ఓపెన్ చేయవద్దని తిమ్మాపూర్ ఏవో సురేందర్ సూచిస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో అనుమానాస్పద మెసేజ్‌లు కనిపిస్తే అడ్మిన్లు వెంటనే డిలీట్ చేయాలని ఎల్ఎండీ ఎస్ఐ శ్రీకాంత్ సూచిస్తున్నారు. సైబర్ వలలో పడి మోసపోతే వెంటనే 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు.
ఎల్లారెడ్డిపేట మండలం దుమాలకు చెందిన రైతు పెరుమాండ్ల అంజయ్య ఈ నెల 13న తనకు పరిచయం ఉన్న వ్యక్తి నుంచి తమ సంఘం గ్రూపులో పీఎం కిసాన్ ఏపీకే లింక్ వచ్చింది. తమ సహచరులే పంపారనుకుని లింక్‌ను ఓపెన్ చేయగా, 14న రాత్రి 2నుంచి 3.30 గంటల మధ్యలో తన బ్యాంకు ఖాతా నుంచి 46వేలు మాయమయ్యాయి. అంజయ్య ఉదయం లేచి, హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతా చెక్ చేసుకునే సరికి మోసపోయానని గ్రహించాడు. వెంటనే బ్యాంకు స్టేట్మెంట్ ద్వారా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తర్వాత 1930 నంబర్‌కు కాల్ చేశాడు.