Cutting Green Trees | సిరిసిల్ల రూరల్, మే 29: తంగళ్ళపల్లి మండలం లక్ష్మీపూర్ లో హరితహారం లో రోడ్డుకిరువైపులా నాటిన చెట్లను నరికేశారు. లక్ష్మీపూర్ శివారులోని రోడ్డు ఇరువైపులా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్ హాయంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇరువైపుల మొక్కలు నాటారు. హరితహారంలో గతంలో ఈ గ్రామాన్ని పోలీసులు దత్తత తీసుకున్నారు.
అప్పటి సీఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో 2016 లో గ్రామస్తుల సహకారంతో రోడ్డుకిరువైపులా మొక్కలను నాటి పెంచారు. గ్రామపంచాయతీ పాలకవర్గం ఇరువైపుల మొక్కలను నీళ్లు పోసి చక్కగా పెంచారు. ఇదిలా ఉండగా గ్రామానికి చెందిన ఐకెపి సీఏ గా పనిచేస్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తి గురువారం తన పొలానికి వెళ్లేందుకు ఇబ్బందిగా ఉందని, రోడ్డుకు ఏ పుగా పెరిగిన హరితహారంలో నాటిన చెట్లను నరికేశారు.
ఈ విషయంపై కార్యదర్శి సంతోష్ వివరణ కోరగా నరికిన చెట్లను పరిశీలించామని, నరికేసిన వ్యక్తి శ్రీనివాస్ నోటీసులు ఇచ్చి, జరిమానా విధిస్తామని పై అధికారులకు కూడా చెబుతామని తెలిపారు. ఇది ఇలా ఉండగా పైప్ లైన్ ఉందని తొలగించామని, మళ్ళీ పక్కకు చెట్లు నాటిస్తామని ఏఎంసీ డైరెక్టర్ బాలు నమస్తే తెలంగాణ కు వివరించారు.