రైతు భరోసా కింద ఏడాదికి ఎకరాకు 15 వేలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇటీవల కేవలం 12 వేలు మాత్రమే ఇస్తామని మాట మార్చింది. ఇది కూడా సాగుకు యోగ్యత ఉన్న వాటికే ఇస్తామనడంతో పాటు వాటి లెక్కలు తేల్చేందుకు ఈ నెల 16 నుంచి వ్యవసాయ, రెవెన్యూ శాఖలతో సర్వే కూడా చేయిస్తున్నది. ఈ నెల 20 వరకు సర్వే ముగించి 21 నుంచి 24 వరకు గ్రామ సభల్లో ఆమోదం పొందాలని, 26 నుంచి రైతుల ఖాతాల్లో భరోసా సొమ్ము జమ చేయాలని చూస్తున్నది. అయితే, ఈ నాలుగు రోజుల్లో ఇంత పెద్ద సర్వే ఎలా పూర్తవుతుందనే విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే సర్వేలో భూముల నిర్ధారణలో ఇబ్బందులు కనిపిస్తున్నాయి.
కరీంనగర్, జనవరి 18 (నమస్తే తెలంగాణ) : కొత్తగా నాలుగు పథకాలు అమలు చేసే క్రమంలో ఈ నెల 12న ఉమ్మడి జిల్లా అధికారులతో ఇన్చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ నిర్వహించిన సమీక్షా సమావేశం తూతూ మంత్రంగా ముగిసింది. కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన ఈ సమావేశంలో మంత్రుల ఉపన్యాసాలు మినహా అధికారులకు మార్గనిర్దేశం చేసింది లేదు. అయితే, ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఈ నెల 16 నుంచి సాగుకు యోగ్యమైన భూములను గుర్తించేందుకు వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు బృందాలుగా ఏర్పడి సర్వేలు చేస్తున్నారు. ప్రతి వ్యవసాయ క్లస్టర్‌కు ఒకటి చొప్పున కరీంనగర్ జిల్లాలో 76 బృందాలు ఏర్పాటు చేశారు.
అందులో వ్యవసాయ విస్తరణ అధికారితోపాటు రెవెన్యూ శాఖ నుంచి గిర్దావర్, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, సర్వేయర్ సభ్యులుగా ఉన్నారు. సర్వే కోసం భూభారతి (ధరణి) పోర్టల్‌లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములను గుర్తించాలి. సాగుకు యోగ్యత లేని భూములను తొలగించేందుకు నాలుగు ప్రామాణీకాలను రూపొందించారు.
ఇండ్లు, లేదా కాలనీలుగా మారిన అన్ని రకాల భూములు, రియల్ ఎస్టేట్ లే ఔట్లు, రోడ్లుగా మారిన భూములు, పరిశ్రమలు, గోదాములు నిర్మించిన భూములు, మైనింగ్‌కు వినియోగిస్తున్న భూములు, ప్రభుత్వం సేకరించిన అన్ని రకాల భూములు, రాళ్లు, రప్పలు, గుట్టలతో నిండి సాగుకు అనువుగా లేని భూములను గుర్తించి రైతుభరోసా పథకం నుంచి మినహాయించాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తున్నది. అందుకోసం మండల వ్యవసాయ అధికారులకు భూభారతి పోర్టల్‌లో లాగిన్ అయ్యే అవకాశం ఇచ్చింది. వీటిని డౌన్లోడ్ చేసుకుని సంబంధిత సర్వే బృందాలకు అందిస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా సర్వేలో భూములను నిర్ధారించడంలో బృందాలకు తిప్పలు తప్పడం లేదు.
వ్యవసాయ యోగ్యంకాని భూములను నిర్ధారించడంలో తహసీల్దార్లు, మండల వ్యవసాయ అధికారులను ప్రభుత్వం బాధ్యులుగా చేసింది. ఈ ప్రక్రియ ప్రతి రెవెన్యూ గ్రామం అంటే వ్యవసాయ క్లస్టర్ వారీగా జరుగుతున్నది. అయితే, సర్వే బృందం ఏ గ్రామానికి వెళ్లినా అక్కడి భూములకు సంబంధించిన రికార్డులు పూర్తిగా వెంట తీసుకెళ్లాలి. ముఖ్యంగా ఆర్వోఆర్ పట్టాదారు పాసు పుస్తకాల జాబితా, విలేజ్ మ్యాప్, గూగుల్ మ్యాప్, గ్రామ పంచాయతీ లే ఔట్ వంటి వివరాలు అధికారుల వద్ద ఉన్నపుడే అవీ ఏ భూములనేది గుర్తించగలుగుతారు. అంతే కాకుండా ప్రభుత్వం సేకరించిన అన్ని రకాల భూముల వివరాలు కూడా అధికారుల వద్ద ఉండాలి. అప్పుడే భూముల వివరాలను సులువుగా గుర్తించే వీలవుతుంది. పరిశ్రమలు, ఇతర నిర్మాణాలు ఉన్నట్లయితే వాటిని భౌతికంగా గుర్తించే వీలుంటుంది.
కానీ, భూ సేకరణ జరిగిన భూముల వివరాలు ఆయా శాఖల్లో ఉంటాయి. రోడ్లు, ఇతర అవసరాలకు తీసుకున్న అనేక భూములు ఇప్పటికీ రెవెన్యూ పహాణీల్లో వస్తున్నాయి. ఇచ్చిన అతి తక్కువ సమయంలో వీటిని ఎలా గుర్తించేదని సర్వేలో పాల్గొంటున్న అధికారులు ప్రశ్నిస్తున్నారు. గ్రామాల్లో జరిగిన లే ఔట్ల వివరాలు కూడా గ్రామ పంచాయతీలో అందుబాటులో లేనట్లు తెలుస్తున్నది. నిజానికి పంచాయతీల పరిధిలోనే అనేక అక్రమ లే ఔట్లు జరుగుతున్నాయి. రికార్డుల ప్రకారంగా ఇవి నాలా కిందికి కన్వర్ట్ అయినట్లు కనిపించవు. మరీ ఇలాంటి భూముల పరిస్థితి సర్వే బృందాలు తేల్చుకోలేక పోతున్నాయి.
అంతేకాకుండా, సర్వేను విచక్షణతో చేయాల్సి వస్తున్నది. ఒక సర్వే నంబర్లో ఎన్ని డివిజన్లు ఉంటే అన్నింటినీ సర్వే బృందాలు పరిశీలిస్తున్నాయి. ఒక సబ్ డివిజన్ సర్వే నంబర్లో రైతు తన అవసరం కోసం కొంత భూమిని అమ్ముకుని, మిగిలిన భూమిలో వ్యవసాయం చేసుకుంటుంటారు. అమ్మిన భూమి నాలా కింద కన్వర్ట్ అయితే మిగతా భూమి కూడా నాలా కిందనే చూపుతున్నట్టు తెలుస్తున్నది. ఇలాంటి వాటిని గుర్తించడంలో అధికారులు విచక్షణ ప్రదర్శించాలి. కానీ, తమదేమి పోయిందని ఉన్నది ఉన్నట్టు రాసుకుంటే రైతులకు అన్యాయం జరిగే ప్రమాదం ఉన్నది. అంతే కాకుండా సెమీ అర్బన్ ఏరియాలో కూడా కొన్ని క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరమున్నది.
మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లో దశాబ్దాల క్రితం ఇండ్లు నిర్మించుకున్న రైతులు ఇంటికి ఆనుకొని ఉన్న భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇలాంటి భూముల్లో ఎక్కువగా కూరగాయలు పండిస్తుంటారు. ఒకే సర్వే నంబర్లో ఇల్లు ఉండి వ్యవసాయం చేస్తున్న భూములను ఏ విధంగా గుర్తించాలనేది సర్వే బృందాలకు బోధపడడం లేదు. ఇలాంటివన్నీ క్షుణ్ణంగా పరిశీలించాలంటే సమయం పడుతుందనే అభిప్రాయం సర్వే బృందాల్లో వ్యక్తమవుతున్నది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఒత్తిడి మేరకు అధికారులు పైపై సర్వే చేసినట్టయితే నిజమైన రైతుకు అన్యాయం జరిగే పరిస్థితి కనిపిస్తున్నది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంపైనా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఈ పథకం కింద ప్రతి నిరుపేద కుటుంబానికి ఏడాదికి 12 వేలు ఇవ్వాలి. కానీ, ప్రభుత్వం ఇక్కడ ఉపాధి హామీ పథకానికి మెలిక పెట్టింది. జాబ్ కార్డు ఉండి ఏడాదిలో కనీసం 20 రోజులు ఉపాధి కూలీకి వెళ్లాలనే నిబంధన పెట్టారు. కరీంనగర్ జిల్లాలో 1,23,625 మంది జాబ్ కార్డులు పొందిన కుటుంబాలు ఉండగా, 2,31,802 మంది కూలీల పేర్లు నమోదై ఉన్నాయి. అందులో 82,460 కార్డులకు సంబంధించిన 1,26,338 మంది మాత్రమే ఆక్టివ్‌గా ఉన్నారు. ఏడాదిలో 20 రోజులు పని చేసింది కేవలం 43,650 మంది మాత్రమే.
అందులో కొంత మందికి వ్యవసాయ భూమి కూడా ఉండి ఉంటుంది. ఆ నిబంధనకు కూడా అమలు చేస్తే ఎంత మంది కూలీలకు అర్హత ఉంటుందనేది సందేహమే. ఒక్క నిబంధనతో ఎంత మందికి అన్యాయం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ పథకంలో మరో చిక్కు కూడా కనిపిస్తున్నది. కొత్తగా మున్సిపాలిటీల్లో విలీనమయ్యే గ్రామాల్లో ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేస్తారు. దీంతో చాలా మందికి ఈ పథకం వర్తించకుండా పోతుంది. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు ఉపాధి హామీ కార్డుకు లింక్ పెట్టవద్దనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది.