Farmers | రామగిరి, మార్చి 23 : కరెంట్ ఓవర్‌లోడ్ సమస్యతో వ్యవసాయ మోటార్లు సరిగా పనిచేయక పంటలు ఎండిపోతున్నాయని ఆదివారంపేట గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై అధికారులు స్పందించి వెంటనే అదనపు ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయాలని రైతులు పెద్దపల్లి కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఆదివారంపేట గ్రామంలో విద్యుత్ ఓవర్‌లోడ్ కారణంగా రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. వ్యవసాయ మోటార్లు సరిగా నడవకపోవడంతో పొలాలకు తగినంత నీరు అందడం లేదని రైతులు తెలిపారు.
దీంతో సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై గతంలో ఒకసారి మళ్లీ సోమవారం కూడా కలెక్టర్‌ను కలిసి తమ సమస్యను వివరించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి పరిష్కారం లభించలేదని రైతులు తెలిపారు. ఇదే సమస్యపై రామగిరి తహసీల్దార్‌కు కూడా వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు తమ సమస్యను పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. అధికారులు తమ గ్రామాన్ని సింగరేణి విస్తరణ, ప్రభావిత ప్రాంతంగా చూపిస్తూ సమస్యను పరిష్కరించడంలో ఆలస్యం చేస్తున్నారని రైతులు విమర్శించారు. అయితే ఆదివారంపేట గ్రామ శివారులో సింగరేణి సంస్థకు సంబంధించిన భూమి ఒక్క గుంట కూడా లేదని రైతులు స్పష్టం చేశారు.
ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని అధికారులు తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. కరెంట్ ఓవర్‌లోడ్ కారణంగా దిగువ ప్రాంతాలకు విద్యుత్ సరఫరా తక్కువగా వస్తోందని, దీనివల్ల వ్యవసాయ మోటార్లు పనిచేయక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రైతులు తెలిపారు. కాబట్టి అధికారులు తక్షణమే స్పందించి అదనపు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి రైతులకు ఉపశమనం కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు.