ప్రకృతి ప్రకోపానికి అన్నదాతల ఆశలు ఆవిరవుతున్నాయి. అకాల వర్షాలు తీవ్ర నష్టాలను మిగుల్చుతున్నాయి. మార్చి, ఏప్రిల్లో పడిన అకాల వర్షాలు, వడగండ్లతో ఒక్క పెద్దపల్లి జిల్లాలోనే 3, 566ఎకరాల్లో పంట నష్టం జరుగగా, నెల రోజులైనా సర్కారు స్పందించకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. పరిహారం ఎప్పుడు వస్తుందా? అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆరుగాలం కష్టపడి సాగు చేస్తే పంట చేతికందకుండానే దూరమైందని, కనీసం ప్రభుత్వ సాయం కరువైందని కన్నీటిపర్యంతమవుతున్నారు.
పెద్దపల్లి, మే 6 (నమస్తే తెలంగాణ) : మార్చి, ఏప్రిల్ నెలల్లో పడిన అకాల వర్షాలకు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 3,566.23 ఎకరాల్లో దాదాపు 3.53 కోట్ల వరకు పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ అధికారులు గుర్తించారు. ఈ యాసంగి పంట మార్చిలో పడిన వర్షాలకు 505.23 ఎకరాల్లో వరి, 642 ఎకరాల్లో మక్క, 27.86 ఎకరాల్లో ఇతర వాణిజ్య పంటలు దెబ్బతిన్నాయి. మొత్తంగా మార్చిలో 1175.16 ఎకరాల్లో పంట నష్టం సంభవించింది.
అదే విధంగా ఏప్రిల్లో పడిన అకాల వర్షాలకు 2391.07 ఎకారాల్లో పంటలు దెబ్బతినగా, అందులో అత్యధికంగా ముత్తారం మండలంలో 1575 మంది రైతులకు చెందిన 1849.1 ఎకరాలు, ఓదెల మండలంలో 583 మంది రైతులకు చెందిన 428.37ఎకరాల్లో వరి దెబ్బతిన్నది. ముత్తారం, మంథని, శ్రీరాంపూర్ మండలాల్లోని 113 ఎకరాల్లో మామిడి దెబ్బతిన్నది. జరిగిన నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా వ్యవసాయ అధికారులు ప్రాథమిక సర్వే చేపట్టి ప్రభుత్వానికి సమర్పించినా పరిహారం పంపిణీ మాత్రం ముందుకు సాగడం లేదు.
పట్టించుకోని ప్రభుత్వం!
మార్చి 2023లో కురిసిన అకాల వర్షాలకు జిల్లాలోని 10,299 మంది రైతులకు చెందిన 6910ఎకరాల్లో పంట నష్టం జరగగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పరిహారం కింద రూ.6.91కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఆ తర్వాత తిరిగి ఏప్రిల్లోనూ అకాల వర్షాలకు కురవగా 17,557 మంది రైతులకు చెందిన 21,948 ఎకరాల్లో పంట నష్టం జరగగా.. ప్రభుత్వం రూ.21.90 కోట్లను విడుదల చేసే క్రమంలోనే ఎన్నికల కోడ్ వచ్చింది. దీంతో అప్పుడు పరిహారం పంపిణీ చేయలేకపోయింది. 2023 డిసెంబర్లో ఎన్నికలు జరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగా ఆ రూ.21.90 కోట్ల పరిహారాన్ని ఇప్పటి వరకు పంపిణీ చేయ లేదు. దీనికి తోడు తాజాగా, ఈ ఏడాది కురిసిన వర్షాలకు సంబంధించిన పరిహారం పంపిణీలో సైతం నిర్లక్ష్యం చేస్తుండడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిండా మునిగాం..
నేను పదెకరాలు మేల్, ఫిమేల్ వడ్లు పెట్టినం. ఎకరాకు 15 క్వింటాళ్లు వచ్చేది. కానీ, అకాల వర్షం వల్ల సగం దిగుబడే వచ్చింది. పెట్టుబడి పైసలు కూడా నష్టపోయాం. నిండా మునిగిపోయినం. ప్రభుత్వమే మమ్ములను ఆదుకోవాలి.
– ఐత చంద్రశేఖర్, ఓడేడ్ (ముత్తారం )
అకాల వర్షంతో నష్టపోయినం
నేను మూడెకరాల్లో మక్కేసిన. గత నెలలో కురిసిన వర్షానికి మక్కంతా పడిపోయి నష్టపోయిన. ఇంక కంకి కూడా రాలే. జల్లుమటుకేసింది. మా గ్రామంలో 250 ఎకరాల్లో మక్కేసినం. ఇక్కడ చానా వరకు పంటలు దెబ్బతిన్నై. 25 శాతం పంట దెబ్బ తిన్నది. ఇంకో పది ఇరవై రోజులైతే పంట చేతికి వస్తదనుకున్నం. ఇంతల్నే ఇట్ల జరిగింది. అధికారులు సర్వేలు చేపట్టి పరిహారం ఇస్తామన్నరు. ఇప్పటి వరకు రాలే.
– పసుంటి సతీశ్, మక్కజొన్న రైతు, కొత్తూరు (ధర్మారం)
ప్రభుత్వం ఆదుకోవాలి
అకాల వర్షం వల్ల నాకు చాలా నష్టం జరిగింది. 19 ఎకరాల్లో మేల్, ఫిమేల్ విత్తన వడ్లు పెట్టిన. వర్షం పడే ముందు రెండెకరాలు కోసిన. ఎకరాకు 24 బస్తాల పంట దిగుబడి వచ్చింది. వర్షం పడ్డ తర్వాత ఎకరాకు కేవలం 8 బస్తాలు మాత్రమే దిగుబడి వచ్చింది. ఎకరానికి 10-12 క్వింటాళ్ల నష్టమైంది. క్వింటాలుకు రూ.8 వేల చొప్పున ఒక్కో ఎకరాకు సుమారు రూ.90 వేల నుంచి రూ.లక్ష వరకు నష్టపోయా. ప్రభుత్వం ఆదుకోవాలి.
– నాంసాని సమ్మయ్య, అడవిశ్రీరాంపూర్ (ముత్తారం)