కార్పొరేషన్, మే 21 : కరీంనగర్ నగరపాలక సంస్థలో ఇంజినీరింగ్ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏటా ఎండకాలం ఆరంభంలో ప్రధాన మురుగుకాలువతోపాటు ఇతర కాలువల్లో చేపట్టాల్సిన సిల్ట్ తొలగింపు పనులను, ఇప్పుడు వానకాలం దగ్గరలో చేపడుతుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అకాల వర్షాలు పడుతుండడం.. మరో పది, పదిహేను రోజుల్లో వానకాలం ప్రారంభమవుతున్న సమయంలో టెండర్లు నిర్వహిస్తుండడంపై అనేక సందేహాలు తెరపైకి వస్తున్నాయి. వర్షకాలం ముందు ఏదో హడావుడిగా పనులు చేసి.. అడ్డదారిలో బిల్లులు లేపేందుకే ఇలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే తమకు అనుకూలంగా పనులు చేపడుతూ ఇష్టారాజ్యంగా దండుకుంటున్నారనే ఫిర్యాదులు వస్తుండగా.. ఇప్పుడు వానకాలం దగ్గరలో టెండర్లు నిర్వహిస్తుండడంపై ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని మురుగు కాల్వల్లో సిల్ట్ తొలగింపు కోసం తొమ్మిది పనులకు 50లక్షల వ్యయంతో ఇటీవల ఇంజినీరింగ్ యంత్రాంగం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆన్లైన్లో షెడ్యూల్ దాఖలు చేయడానికి సోమవారంతోనే గడువు(ఈ నెల 20) ముగిసింది. జూన్ మొదటి వారంలో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు విస్తరించి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణశాఖ ప్రకటించింది. గతేడాది ఏప్రిల్‌లోనే టెండర్ల పక్రియ పూర్తి చేసి, మే నెలలో సిల్ట్ తొలగింపు పనులు చేపట్టగా.. ఈ ఏడాది మాత్రం ఇంజినీరింగ్ అధికారులు మే చివరి వారంలో టెండర్లు నిర్వహించడం విమర్శలకు తావిస్తున్నది. టెండర్లను ఇప్పుడు ప్రారంభిస్తే.. కాంట్రాక్టర్ పనులు ఎప్పుడు పూర్తి చేస్తారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అకాల వర్షాలు పడుతున్నాయి. వర్షాలు ఇంకా పడితే మురుగు కాల్వల్లో సిల్ట్ తీసే అవకాశాలు అంతంతే ఉంటాయి. వేసవిలో చేయాల్సిన పనులను ఇంజినీరింగ్ అధికారులు ఇప్పటి వరకు ఎందుకు పెండింగ్‌లో పెట్టారని పలువురు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కేవలం వర్షాలకు ముందు హడావిడిగా పనులు చేసి, తప్పుడు లెక్కలతో బిల్లులు డ్రా చేసుకోవాలన్న ఆలోచనతోనే ఈ టెండర్లను ఆలస్యం చేశారని ఆరోపిస్తున్నారు. నగరంలో ఉన్న రెండు ప్రధాన మురుగు కాలువల్లో ఎక్కడో చోట సిల్ట్ నామమాత్రంగా తొలగించి దండుకోవచ్చనే లక్ష్యంతోనే ఇలా చేశారని విమర్శిస్తున్నారు. టెండర్ల విషయమై కార్పొరేషన్ ఎస్ఈ మహేందర్‌ను సంప్రదించగా.. ప్రతి సంవత్సరం మాదిరాగానే ఈ సారి కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎక్కడా ఆలస్యం జరగలేదని చెప్పారు.