ఏసీబీకి చిక్కిన కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ సెలెక్షన్ గ్రేడ్ కార్యదర్శి ఏ పురుషోత్తం అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఐదేళ్ల క్రితం కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ఆయన విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా అవినీతి నిరోధక శాఖకు చిక్కిన ఆయన, ఐదేళ్ల అక్రమ సంపాదన 5 కోట్లకు మీదనే ఉంటుందని పండ్ల వ్యాపారులు ఆరోపిస్తున్నారు. ఆయన వేధింపులు భరించలేకనే ఏసీబీకి పట్టించామని స్పష్టం చేస్తున్నారు.
కరీంనగర్, మార్చి 30 (నమస్తే తెలంగాణ ) : ఓ పండ్ల వ్యాపారి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ సెలెక్షన్ గ్రేడ్ కార్యదర్శి పురుషోత్తం అవినీతికి అడ్డూ అదుపు ఉండదనే ఆరోపణలున్నాయి. లంచం కోసం ఎంతకైనా తెగిస్తాడనే విమర్శలున్నాయి. ఆయన వేధింపులు భరించలేకనే కార్యదర్శిని ఏసీబీకి పట్టించామని పండ్ల వ్యాపారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన అవినీతి చిట్టా విప్పుతున్నారు. 12 మంది పండ్ల వ్యాపారుల లైసెన్స్‌ల రెన్యూవల్ కోసం వేధించాడని, ఒక్కో వ్యాపారి 2లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడని, ఓ మంత్రితో చెప్పించినా వినలేదని, తమ వల్ల కాదని చెప్పడంతో చివరకు 60వేలకు ఒప్పుకొన్నాడని వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే పండ్ల మార్కెట్ వ్యాపారుల అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ గఫూర్ అలియాస్ నిమ్మకాయల పాషా నుంచి శనివారం 60 వేలు లంచం తీసుకుంటూ కార్యదర్శి పురుషోత్తంతోపాటు ఔట్ సోర్సింగ్ సెక్యూరిటీగార్డు కరివేద శ్రీనివాస్ రెడ్డి ఏసీబీ అధికారులకు చిక్కారు. అయితే గతేడాది నలుగురు పండ్ల వ్యాపారుల లైసెన్స్‌లు రెన్యూవల్ చేసేందుకు ఒక్కొక్కరి నుంచి లక్ష లంచంగా తీసుకున్నాడని వ్యాపారులు ఆరోపిస్తున్నారు.
పండ్ల వ్యాపారులనే కాదు, కూరగాయల వ్యాపారులను సైతం వదలరని చెబుతున్నారు. స్థానిక రైతు బజార్లలో కూరగాయల వ్యాపారం చేసుకునే 72 మంది నుంచి పెద్ద మొత్తంలో లంచాలు తీసుకున్నారని చర్చించుకుంటున్నారు. ఒక్కొక్కరి నుంచి 20 వేలు లంచం తీసుకొని, వారి లైసెన్స్‌లు రెన్యూవల్ చేసినట్టు తెలుస్తున్నది. లంచాల కోసం వేధించడమే పనిగా పెట్టుకున్న కార్యదర్శి తాము వ్యాపారం చేసుకునేందుకు కూడా పూర్తి స్థాయిలో సహకరించేవాడు కాదని వ్యాపారులు చెబుతున్నారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మార్కెట్లకు అన్ని వసతులు కల్పించాల్సిన బాధ్యత మార్కెట్ కమిటీలకు ఉంటుంది. కానీ ఈ కార్యదర్శి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించేవారనే ఆరోపణలున్నాయి. రైతులు పండ్లు తీసుకుని మార్కెట్‌కు వస్తే గేట్లు మూయించి ఇక్కడ వ్యాపారులు లేరని, వరంగల్ మార్కెట్‌కు వెళ్లమని వారితో చెప్పించేవారని రైతులు చెబుతున్నారు. అంతే కాకుండా రాత్రి పూట మార్కెట్ నడుస్తుండగానే తన సిబ్బందిని ఆదేశించి విద్యుత్తు సరఫరా నిలిపి వేయించే వారని మండిపడుతున్నారు. లైసెన్స్‌ల కోసమే కాకుండా నెల నెలా మామూళ్లు డిమాండ్ చేసే వారని, ఇవ్వక పోతే ఇబ్బందులు పెట్టే వారని వివరిస్తున్నారు.
మార్కెటింగ్ కార్యదర్శి పురుషోత్తం లంచాల కోసం మా వ్యాపారులను తీవ్రంగా వేధించేవాడు. పోయిన సారి నా లైసెన్స్ రెన్యూవల్ కోసమే రూ.లక్ష ఇచ్చిన. ఇంట్లో బంగారం కుదువ పెట్టి, అక్కడా ఇక్కడా అప్పులు చేసి లంచాలు ఇవ్వాల్సి వస్తంది. నేను చాలా సార్లు చెప్పి చూసిన. వినలేదు. పెద్దోళ్లకు చెప్పుకొంటే.. ఆయన దగ్గరికి ఎందుకు పోయినవ్? ఈయన దగ్గరికి ఎందుకు పోయినవ్? అని బెదిరిస్తుండె. మార్చి నెలాఖరుకు లైసెన్స్‌లు రెన్యూవల్ చేసుకోవాలె. ఎంత బతిమిలాడినా పైసలు ఇవ్వకుంటే రెన్యూవల్ చేయనని చెప్పిండు. మమ్మల్ని అందరినీ ఆయన చాంబర్లోనే కూసోపెట్టి లంచం డిమాండ్ చేసిండు. ఏసీబీకి పట్టియ్యాల్ననే ఇస్తమని ఒప్పుకున్నం. మా కొడుకు ఫజల్ పేరున ఉన్న లైసెన్స్ రెన్యూవల్ కోసం రూ.60వేలు పట్టుకుని కార్యదర్శి దగ్గరికి పోయిన. సెక్యూరిటీ గార్డుకు ఇవ్వమన్నడు ఇచ్చిన. ఏసీబీ సార్లు వచ్చి పట్టుకున్నరు. ఆయన అరాచకాలు, వేధింపులు భరించ లేకనే ఈ పని చేయాల్సి వచ్చింది. కూరగాయ వ్యాపారుల నుంచి కూడా పెద్ద మొత్తంలో పట్టిచ్చిండు. పాపం వాళ్లు కూడా మొత్తుకుంటున్నరు. ఆయన వచ్చిన ఐదేళ్లల కమ్‌సే కమ్ రూ.5కోట్లు కమాయించిండు. ఎప్పుడు చూసినా పైసలే అంటడు. నాకు 1.06 లక్షలు ఇయ్యాలే. అడిగితే బెదిరిస్తడు. ఇది చేస్తా.. అది చేస్తా అంటడు.