Employees | రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్, జూలై 27 : సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం) విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలు చేయాలని టీఎస్సీఈపీయూఎస్ నాయులు డిమాండ్ చేశారు. ఆ సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎస్సీఈపీయూఎస్ నాయకులు జిల్లా అధికారులకు వినతిపత్రం అందజేశారు. టీఎస్సీఈపీయూఎస్ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.
సీపీఎస్ వల్ల ఉద్యోగుల పదవీ విరమణ అనంతరం ఆర్థిక భద్రత పూర్తిగా దెబ్బతింటోందని, జీవితాంతం సేవలందించిన ఉద్యోగులు అనిశ్చితిలోకి నెట్టబడుతున్నారని విమర్శించారు. దేశంలోని పలు రాష్ట్రాలు ఇప్పటికే ఓపీఎస్ అమలు చేస్తున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేవలం హామీలకే పరిమితం కాకుండా స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు.