తెలంగాణచౌక్, ఏప్రిల్12: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు కొయ్యడ సృజన్‌కుమార్ ఆధ్వర్యంలో నాయకులు నగరంలోని కమాన్ చౌరస్తాలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సృజన్‌కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మత స్వేచ్ఛను హరించేలా వక్ఫ్ బోర్డు చట్టాన్ని సవరించి ముస్లిం మతాచారాల్లో జ్యోకం చేసుకుంటున్నదని ఆరోపించారు.
దీనికి దేశవ్యాప్తంగా పార్టీలు, ప్రజాసంఘాలు వ్యతిరేకించినా టీడీపీ, జేడీయూ సహకారంతో బిల్లును పార్లమెంట్లో ఆమోదించడం సరికాదన్నారు. ముస్లిం మైనార్టీలను అణిచివేయాలని కేంద్రం కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. మైనార్టీల అభివృద్ధి అడ్డుగోడగా ఉన్న వక్ఫ్ బోర్డు సవరణచట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ ఆ పార్టీ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, నాయకులు పైడిపల్లి రాజు, బుచ్చన్నయాదవ్, రవి, సాహిమ్ బేగం, రజియా సఫిన్, సుల్తానా పాల్గొన్నారు.