రాంనగర్, డిసెంబర్ 28: అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం సంతృప్తి కలిగించిందని కరీంనగర్ సీపీ అభిషేక్ మహాంతి అన్నారు. సిబ్బంది కృషితోనే ఇది సాధ్యమైందన్నారు. గురువారం కమిషనరేట్‌లో మీడియాకు నేర సమీక్షా వార్షిక నివేదికను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల బదిలీల్లో కరీంనగర్ కమినరేట్కు వచ్చిన అధికారులు, సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించగలిగామని తెలిపారు. ప్రతియేటా పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్ నేరాల సంఖ్య, మాదక ద్రవ్యాల వినియోగం కూడా పెరుగుతుందని తెలిపారు. వీటి కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు.
2023లో వివిధ నేరాల్లో భాగంగా 5908 కేసులు నమోదు చేశామని తెలిపారు. ప్రజావాణి వచ్చిన 1268 ఫిర్యాదుల్లో 1112 పరిష్కరించామని, డయల్ 100 ద్వారా 43,199 ఫిర్యాదులు రాగా బ్లూకోల్ట్స్ సిబ్బంది ద్వారా స్పందించామన్నారు. అసెంబ్లీ ఎన్నికల టైంలో 5 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి 4.4 కోట్ల నగదు, 1.89 లక్షల గంజాయి, 19.11 లక్షల విలువైన మద్యం, 8.59 లక్షల విలువైన అభరణాలు, 2.38 లక్షల విలువైన సామగ్రి సీజ్ చేశామని, ఇవన్ని ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు పరిష్కరించబడుతాయని తెలిపారు. ఈ యేడు హత్య కేసులు, అత్యాచారాలు, ఫోక్సో కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. షీటీంల ఆధ్వర్యంలో 225 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. 1991 కేసులు కోర్టు ద్వారా పరిష్కరించబడగా, 765 కేసుల్లో నిందితులకు శిక్ష పడిందని, 618 కేసులు లోక్ అదాలత్‌లో పరిష్కరించామన్నారు.